Ashok Babu: వీళ్లు ప్రభుత్వానికి ఎందుకు దాసోహం అంటున్నారో అర్థం కావడంలేదు: ఉద్యోగ సంఘాల నేతలపై అశోక్ బాబు విమర్శలు

  • నిన్న ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం
  • సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నేతలు
  • వైసీపీ సర్కారుపైనా, ఉద్యోగ సంఘాల నేతలపైనా అశోక్ బాబు విమర్శలు
TDP leader Ashok Babu slams AP govt and Employees leaders

ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ మంత్రుల కమిటీ సమావేశం నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ ఉద్యోగ సంఘం నేత పరుచూరి అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. నాడు జగన్ విపక్షనేతగా ఉన్నప్పుడు, ఎన్నికల హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేయాలని అన్నాడని, మరి నేడు సీపీఎస్ రద్దు చేయని జగన్ రాజీనామా చేస్తారా? అని అశోక్ బాబు నిలదీశారు. సీపీఎస్ రద్దు చేయకపోవడంతో పాటు, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు ఇవ్వలేనందుకు జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. 

"టీడీపీ తరఫున అడుగుతున్నా... ఎప్పుడు రాజీనామా చేస్తావు జగన్? నాడు కాంట్రాక్టు ఉద్యోగులు... జగనన్న వస్తాడు, మా జీవితాలు మార్చుతాడు అని ఎంతో ఆశతో నీకు ఓటేశారు. కానీ నువ్వేం చేశావు... 2014కి ఐదేళ్లు పూర్తయిన వారినే క్రమబద్ధీకరిస్తానంటున్నావు. మరి మిగతా వాళ్ల సంగతేంటి? జగన్ మాటలన్నీ కూడా నిర్దిష్టమైన హామీ, విధానం లేకుండా... పబ్బం గడుపుకోవడానికి చెప్పినట్టే ఉన్నాయి. 

27 శాతం ఉన్న ఐఆర్ ను 23 శాతంగా చేసి రివర్స్ పీఆర్సీ ఇస్తున్నారు. ఉద్యోగులు నిరసనలు చేసినా దాన్ని ఉద్యోగ సంఘాల నేతలు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇవాళ కూడా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు తమకు చాలా సంతృప్తిగా ఉందని అంటున్నారు. ఉద్యోగులను ఓటు బ్యాంకుగా చూస్తూ, వారి డిమాండ్లను పరిష్కరిస్తున్నారే తప్ప, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ఏమిటన్నది ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి లేదు. 

ఇవాళ ఉద్యోగులకు చెల్లించాల్సిన శాలరీ బిల్లు పెరిగిందని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఎందుకు పెరిగిందీ... వాలంటీర్లను నువ్వు పెట్టుకున్నావు... మేం అడగలేదు కదా! గ్రామ సచివాలయాలు నువ్వు పెట్టుకున్నావు... ఇది మా పార్టీ విధివిధానం అని చెప్పావు. ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో కలిపావు. వీటన్నింటి వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.6 వేల కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. ఉన్న ఉద్యోగుస్తులు దీనికి బాధ్యులు కారు కదా!

నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఉద్యోగులను ఎందుకు నిందించాలి? ఏపీలోనే అత్యధికంగా ఉద్యోగులకు శాలరీ బిల్లు అవుతోందని ఎందుకు చెప్పుకోవాలి? అది కూడా రివర్స్ పీఆర్సీ ఇచ్చావు. దేశంలో ఎక్కడైనా రివర్స్ పీఆర్సీ ఇచ్చారా? ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ఇచ్చారా? ఎక్కడా ఇవ్వడంలేదు. మరి ఆ విషయం నువ్వెందుకు చెప్పడంలేదు? 

ఉద్యోగులను దోషులుగా చూపించేందుకు ప్రభుత్వం, ప్రభుత్వానికున్న పేపర్లు, చానళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని ఎదుర్కొనే సత్తా ఉద్యోగ నేతలకు ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి ఎందుకు దాసోహమవుతున్నారో వారే చెప్పాలి. రేపు వచ్చే కొత్త ప్రభుత్వం ఈ బకాయిలతో తమకు సంబంధం లేదంటే నష్టపోయేది ఎవరు? ఉద్యోగస్తులే కదా. 

రైతు రుణమాఫీనే అంగీకరించలేని ఈ ప్రభుత్వ నేతలకు...  వచ్చే నాలుగేళ్లలో అరియర్స్ చెల్లిస్తామని చెప్పే నైతిక హక్కు ఎక్కడుంది? సీపీఎస్ రద్దు చేస్తామని మాటిచ్చిన ఈ ప్రభుత్వానికి జీపీఎస్ ఇచ్చే నైతిక హక్కు ఎక్కడుంది?

కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని నాడు చెప్పి, ఇప్పుడు ఐదేళ్లు పూర్తి చేసుకున్నవారికే అంటూ మడత పేచీ పెడుతున్నావు. కేవలం కొందరు ఉద్యోగులకే లబ్ది చేకూరేలా నిర్ణయం తీసుకోవడంలో అర్థమేంటి? దీనికి ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా జవాబు చెప్పాలి" అని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

More Telugu News