లోకో పైలట్ అప్రమత్తత.. తృటిలో తప్పిన రైలు ప్రమాదం

లోకోపైలట్ అప్రమత్తతతో మరో రైలు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడుతున్న సమయంలో ఓ ట్రాక్టర్ దాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ రైలు బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఝార్ఖండ్‌లో సంతాల్‌ధీ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

రైల్వే గేటును ట్రాక్టర్ ఢీకొనడాన్ని గమనించిన ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు 45 నిమిషాలు పాటు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ట్రాక్టర్‌ను జప్తు చేసి కేసు నమోదు చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.


More Telugu News