Narendra Modi: అమెరికాలో మరో రికార్డు సృష్టించనున్న ప్రధాని మోదీ

PM Modi Will Be 1st Indian Prime Minister To Address US Congress Twice
  • జూన్ 22న అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
  • ఈ మేరకు మోదీకి వైట్‌ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ తదితరుల ఆహ్వానం
  • ధన్యవాదాలు చెబుతూ మోదీ ట్వీట్, ఇది తనకెంతో గర్వకారణమని వ్యాఖ్య
  • అమెరికా కాంగ్రెస్‌లో రెండుసార్లు ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా త్వరలో మోదీ రికార్డు
అమెరికాలో అధికారిక పర్యటన చేపట్టనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. అమెరికా చట్టసభల్లో రెండుసార్లు ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. 

అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించాలంటూ మోదీకి వైట్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ, సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షూమర్, సెనేట్ రిపబ్లికన్ లీడర్ మిచ్ మెక్కానల్ తదితరులు ఆహ్వానించగా భారత ప్రధాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తాను ఉత్సుకతతో ఉన్నానని, ఇది తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. అమెరికాతో ప్రపంచస్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం భారత్‌కు గర్వకారణమని ప్రధాని మంగళవారం ట్వీట్ చేశారు. ప్రజాస్వామిక విలువల ఆధారంగా భారత్-అమెరికా బంధం ఏర్పడిందని చెప్పారు. ప్రపంచశాంతికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. 

కాగా, జూన్ 22న భారత ప్రధాని అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. భారత దేశ భవిష్యత్తు కార్యాచరణ, ఇరు దేశాలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడతారు. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ అధికారిక విందు కూడా ఏర్పాటు చేశారు. 

కాగా, మోదీకి ఇది రెండో అధికారిక అమెరికా పర్యటన. 2016 జూన్‌లో ఆయన తొలిసారిగా అగ్రరాజ్యంలో పర్యటించారు. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మాత్రమే అమెరికా చట్టసభల్లో రెండు పర్యాయాలు ప్రసంగించారని భారత అధికారులు వెల్లడించారు.
Narendra Modi

More Telugu News