nova kakhovka dam: ఉక్రెయిన్ లో కీలక డ్యామ్ పేల్చివేత.. దిగువకు పోటెత్తిన వరద.. వీడియోలు వైరల్!

  • ఉక్రెయిన్ కు కీలకమైన ‘నోవా కఖోవ్కా’ డ్యామ్‌
  • దాడి జరగడంతో బద్దలైన గేట్లు.. దిగువకు భారీగా వరద
  • రష్యా పనే అని ఉక్రెయిన్ ఆరోపణ.. ఉగ్రదాడి కావచ్చన్న రష్యా
  • లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని సూచించిన అధికారులు
nova kakhovka dam blown up ukraine dam near nuclear plant destroyed zelensky calls urgent meet

ఏడాదిన్నరగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మొన్నటిదాకా రష్యాను కేవలం ప్రతిఘటిస్తూ వచ్చిన ఉక్రెయిన్.. ఇటీవల రష్యాలోనూ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు కీలకమైన ‘నోవా కఖోవ్కా’ డ్యామ్‌ ను పేల్చివేశారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున గేట్లు తెగిపోయాయి. నీరు దిగువకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేల్చివేతకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్లో కొందరు పోస్టు చేశారు. అయితే నిజంగా ‘నోవా కఖోవ్కా’ డ్యామ్‌కు సంబంధించినవా? కాదా అనే దానిపై క్లారిటీ లేదు.

నీపర్‌ నదిపై నోవా కఖోవ్కా డ్యామ్‌ను నిర్మించారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్‌కు 30 కిమీ దూరంలో కట్టిన ఈ డ్యామ్‌ వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. కొన్ని నెలలుగా ఈ డ్యామ్‌ సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. రష్యా దళాలే డ్యామ్ ను పేల్చివేశాయని దక్షిణ ఉక్రెయిన్‌ మిలటరీ కమాండ్‌ ఆరోపించింది. ఈ ఘటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అత్యవసర భేటీ నిర్వహించనున్నారు.

మరోవైపు ఆక్రమిత ఉక్రెయిన్‌లోని రష్యా అధికారులు మాత్రం ‘ఇది ఉగ్రదాడి’ అని చెబుతున్నట్లు టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. దీనిపై స్థానిక రష్యా మేయర్‌ వ్లాదిమిర్‌ లియోనేటివ్‌ మాట్లాడుతూ ‘‘అర్ధరాత్రి రెండు గంటల నుంచి కఖోవ్కా డ్యామ్‌పై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు గేటు వాల్వులు దెబ్బతిన్నాయి. ఫలితంగా నీటి లీకులు మొదలయ్యాయి. కొద్దిసేపటికే నియత్రించలేని విధంగా నీరు కిందకు ప్రవహించడం మొదలైంది’’ అని వెల్లడించారు. 

డ్యామ్ బద్దలు కావడంతో ఖెర్సాన్‌లోని లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. ఐదున్నర గంటల్లో వరద అక్కడకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. నీపర్‌ నదికి తూర్పు తీరాన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని ఉక్రెయిన్‌ అధికారులు విజ్ఞప్తి చేశారు. 

‘నోవా కఖోవ్కా’ డ్యామ్‌.. 30 మీటర్ల ఎత్తు, కొన్ని వందల మీటర్ల పొడవు ఉంది. 1956లో కఖోవ్కా జలవిద్యుత్తు కేంద్రంలో భాగంగా నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లో  18 క్యూబిక్‌ కిలోమీటర్ల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆనకట్టను పేల్చివేస్తారనే భయాలు నెలకొన్నాయి. తాజాగా ఈ డ్యామ్‌ పేల్చివేతతో ఉక్రెయిన్‌ కరెంటు కష్టాలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి అణువిద్యుత్తును ఇచ్చే జపొరిజియా రష్యా స్వాధీనంలోకి వెళ్లిపోయింది.

More Telugu News