Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద తీవ్రతకు కారణమిదే!

  • గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ప్రమాదం
  • గూడ్స్ లో ఇనుప ఖనిజం ఉండటంతో భారీ సంఖ్యలో మరణాలు
  • ప్రమాదానికి అతి వేగం కారణం కాదని స్పష్టం చేసిన రైల్వే బోర్డు
there has been some issue with the signalling railway board on odisha train accident

సిగ్నలింగ్‌ లో సమస్య కారణంగానే ఒడిశా రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని రైల్వే బోర్డు తెలిపింది. అయితే ఈ ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని వెల్లడించింది. ఈ ఘటనలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైందని చెప్పింది.

ఆదివారం రైల్వే బోర్డు (ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) సభ్యురాలు జయవర్మ సిన్హా మీడియాతో మాట్లాడారు. ప్రమాద సమయంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు దాదాపు గంటకు 128 కి.మీ వేగంతో వెళ్తున్నట్లు వివరించారు. అయితే అతి వేగం ప్రమాదానికి కారణం కాదని స్పష్టం చేశారు. సాధారణంగానే ఆ రైళ్ల వేగం గంటకు 130 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలిపారు.

‘‘ఒడిశా రైలు ప్రమాద ఘటనలో గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ లోకి వెళ్లి.. గూడ్స్ రైలును ఢీకొట్టింది. అయితే ఆ గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉంది. అందుకే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై తీవ్ర ప్రభావం పడింది. భారీ సంఖ్యలో మరణాలు, గాయాలకు దారితీసింది’’ అని వెల్లడించారు.

‘‘ప్రమాదం వల్ల పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు డౌన్‌లైన్‌లోకి వచ్చాయి. అదే సమయంలో ఆ ట్రాక్ పై 126 కి.మీ వేగంతో వెళ్తోన్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ చివరి రెండు బోగీలను ఢీకొట్టాయి’’ అని చెప్పారు. బాధిత కుటుంబాలు హెల్ప్‌లైన్ నంబర్ 139ను సంప్రదించవచ్చని సూచించారు. వారి ప్రయాణం, ఇతర ఖర్చులు భరిస్తామని తెలిపారు.

More Telugu News