Rahul Gandhi: వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఉండదు.. కర్ణాటకలో మాదిరే తుడిచిపెట్టేస్తాం: రాహుల్ గాంధీ

Congress Will Decimate BJP In Telangana and Other State Polls says Rahul Gandhi
  • బీజేపీ విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు దేశమే సిద్ధమైందన్న రాహుల్
  • కర్ణాటకలో కేవలం ఓడించలేదని.. తుడిచిపెట్టేశామని వ్యాఖ్య
  • రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ కనిపించకుండా పోతుందన్న కాంగ్రెస్ నేత
  • ప్రతిపక్షాలు ఏకమయ్యాయని, 2024లో బీజేపీని ఓడిస్తాయని ధీమా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ విజయ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సహా ఇతర అనేక రాష్ట్రాల్లోనూ బీజేపీని మట్టికరిపిస్తామని చెప్పారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాదని, మొత్తం దేశమే ఈ విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని అన్నారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. వాషింగ్టన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో కార్యక్రమాలను ముగించుకొని న్యూయార్క్‌ చేరుకున్నారు. అక్కడ ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ - యూఎస్‌ఏ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీని తుడిచిపెట్టేయగలమని కర్ణాటకలో మేం నిరూపించాం. మేం వారిని కేవలం ఓడించలేదు.. తుడిచిపెట్టేశాం’’ అని చెప్పారు.  

‘‘కర్ణాటకలో బీజేపీ అన్ని శక్తులను ఒడ్డి పోరాడింది. వారి వెంట మొత్తం మీడియా ఉంది.. మా దగ్గర కంటే వారి దగ్గర 10 రెట్లు ఎక్కువ డబ్బు ఉంది. వాళ్ల ప్రభుత్వం ఉంది.. ఏజెన్సీలు ఉన్నాయి. ఇలా అన్నీ ఉన్నాయి. కానీ చివరికి ఆ పార్టీని కాంగ్రెస్‌ తుడిచిపెట్టేసింది’’ అని రాహుల్ చెప్పారు.

‘‘తర్వాత తెలంగాణలోనూ బీజేపీని తుడిచిపెట్టేస్తామని మీకు తెలియజేయాలనుకుంటున్నా.. రాబోయే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఉందో లేదో గుర్తించడం కష్టమవుంది’’ అని అన్నారు. అలాగే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ కనిపించకుండా పోతుందని వ్యాఖ్యానించారు. భాజపా చేస్తున్న విద్వేష రాజకీయాలతో ముందుకెళ్లలేమని దేశ ప్రజలు గుర్తించడమే అందుకు కారణమన్నారు.

‘‘2024 ఎన్నికల్లోనూ బీజేపీని ఓడిస్తాం. ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఓవైపు బీజేపీ విద్వేషపూరిత సిద్ధాంతం.. మరోవైపు కాంగ్రెస్‌ ప్రేమపూర్వక సిద్ధాంతం ప్రజల ముందున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మద్దతుదారులు, పార్టీ నేతలు, ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కూడా హాజరయ్యారు.
Rahul Gandhi
Telangana
Congress
BJP
2024 Elections
Telangana Assembly Elections
Karnataka

More Telugu News