Andhra Pradesh: ఒడిశా రైలు ప్రమాదం: రెండు రైళ్లలోనూ ఏపీ ప్రయాణికులు

Nearly 122 above Andhra Pradesh passengers travelling in Those trains
  • ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన
  • కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఏపీలో దిగాల్సిన వారు 70 మంది
  • బెంగళూరు హౌరా ఎక్స్ ప్రెస్ లో ఎక్కిన ఏపీ ప్యాసెంజర్లు 52 మంది..
ఒడిశాలోని బాలేశ్వర్ దగ్గర్లో ప్రమాదానికి గురైన రెండు రైళ్లలోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికులు ఉన్నారని అధికారవర్గాల సమాచారం. రిజర్వేషన్ వివరాల ఆధారంగా రాష్ట్రంలోని వివిధ స్టేషన్లలో ఎక్కిన, దిగాల్సిన ప్రయాణికులు రెండు రైళ్లలో కలిపి 122 మంది ఉన్నారు. ఇందులో కొంతమంది క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం అందించారు. అయితే, చాలా మంది ప్రయాణికుల వివరాలు మాత్రం తెలియరాలేదు. వారి ఫోన్లు కలవడంలేదని కొంతమంది, స్విచ్ఛాప్ అని వస్తోందని మరికొంతమంది చెప్పారు. దీంతో తమ వారికి ఏం జరిగిందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు రైల్వే అధికారులు, కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రంలోని వివిధ రైల్వే స్టేషన్లలో హెల్స్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గురైన రైళ్లలోని ప్రయాణికుల వివరాలను ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ని రంగంలోకి దించారు.

యశ్వంత్ పూర్ నుంచి హౌరా వెళుతున్న హౌరా ఎక్స్ ప్రెస్ రైలులో తిరుపతిలో 12 మంది, చీరాలలో 12 మంది, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, బాపట్ల స్టేషన్లలో ఇద్దరేసి చొప్పున, బెజవాడలో నలుగురు, రేణిగుంటలో 8 మంది ప్రయాణికులు ఎక్కారని రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తంగా హౌరా ఎక్స్ ప్రెస్ లో 52 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారు.

షాలిమార్ నుంచి చెన్నై వస్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో సుమారు 70 మంది ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు ఉన్నట్లు రిజర్వేషన్ వివరాల ఆధారంగా తెలుస్తోంది. ఈ ట్రైన్ లో ఎక్కిన వారిలో విజయవాడలో 47 మంది, రాజమహేంద్రవరంలో 22 మంది, ఏలూరులో ఒకరు.. మొత్తం 70 మంది ప్రయాణికులు ఏపీలో దిగాల్సి ఉంది. ఇదే రైలులో చెన్నై సెంట్రల్ కు ప్రయాణించేందుకు రాజమహేంద్రవరం నుంచి 56 మంది, తాడేపల్లిగూడెంలో 10 మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు రిజర్వేషన్ చేయించుకున్నారు. ప్రమాదం కారణంగా వీరి ప్రయాణం రద్దయింది.
Andhra Pradesh
Train Accident
coramandal express
ap passengers

More Telugu News