Vijayanagaram District: కూతురు త్వరగా ఎదగాలని ఇంజెక్షన్లు ఇప్పించిన తల్లి.. బాధ భరించలేక ఫిర్యాదు చేసిన కూతురు!

  • విజయనగరంలో వెలుగు చూసిన ఘటన
  • టీనేజ్ కూతుర్ని హీరోయిన్ చేయాలనుకున్న తల్లి
  • బాలిక త్వరగా ఎదిగేందుకు ఇంజెక్షన్లు
  • ఇంజక్షన్లు వికటించడంతో బాలికకు అనారోగ్యం
  • తల్లి వేధింపులు తాళలేక చైల్డ్ కేర్ సిబ్బందిని ఆశ్రయించిన బాలిక
Woman wants her daughter to be heroine resorts to injections to make her grow faster

కూతురిని హీరోయిన్ చేయాలనుకున్న ఓ తల్లి అడ్డదారులు తొక్కింది. బిడ్డ త్వరగా పెద్దవ్వాలనే ఉద్దేశ్యంతో ఆమెకు రకరకాల ఇంజక్షన్లు ఇప్పించింది. అవి వికటించడంతో బాలిక అనారోగ్యం పాలైంది. తల్లి వేధింపులు తాళలేని బాలిక చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఏపీలోని విజయనగరంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఉండే ఓ మహిళకు (40) 15 ఏళ్ల కూతురు ఉంది. కొన్నేళ్ల క్రితమే మహిళ భర్త చనిపోయాడు. ఆ తరువాత ఆమె రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే, కొన్నాళ్ల తరువాత మహిళ రెండో భర్త తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే, విశాఖలోని ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుతున్న పెద్ద కూతురు ఇటీవలే ఎండాకాలం సెలవులపై తల్లి వద్దకు వచ్చింది. అయితే, తల్లి కోసం తరచూ ఎవరెవరో ఇంటికి వచ్చి వెళుతుండటంతో అక్కడి వాతావరణం బాలికకు నచ్చలేదు. ఈ విషయమై తల్లీకూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

ఇటీవల మహిళ ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి బాలికను చూసి ఆమెకు హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. అయితే, ఆమె మరింత బొద్దుగా మారితే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అన్నాడు. ఈ క్రమంలో అతడి సలహా మేరకు ఆ మహిళ తన కూతురికి రకరకాల ఇంజెక్షన్లు ఇప్పించింది. కానీ, అవి వికటించడంతో బాలిక అనారోగ్యం పాలైంది. ఇంజెక్షన్లు భరించలేనని ఆమె తల్లిని వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. దీంతో, బాలిక చైల్డ్‌హెల్ప్ లైన్ సిబ్బందికి సమాచారం అందించింది. బాలికను వారు బాలల సంరక్షణాలయానికి తరలించారు.

More Telugu News