Imran Khan: నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోపై ఇమ్రాన్ ఖాన్ రూ.1500 కోట్ల పరువు నష్టం దావా

  •  
  • గత నెలలో తన అరెస్ట్ వల్ల తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందన్న ఇమ్రాన్
  • తనను అరెస్ట్ చేయడానికి పాకిస్థాన్ రేంజర్లను ఉపయోగించారని విమర్శ 
  • లీగల్ నోటీసులు పంపినట్లు చెప్పిన ఇమ్రాన్ ఖాన్
Malafide arrest affected my reputation Agitated Imran Khan to file PKR 15 bn defamation suit

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ రూ.1500 కోట్ల పాకిస్థానీ రూపాయల పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోపై ఈ కేసు వేయనున్నారు. గత నెల జరిగిన తన అరెస్ట్ వల్ల తన ప్రతిష్ఠ తీవ్ర భంగం వాటిల్లిందని చెబుతున్నారు. ఎన్ఏబీ చైర్మన్‌పై పదిహేను వందల కోట్ల పాకిస్తానీ రూపాయల పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించినట్లు తెలిపారు.

తన అరెస్ట్ వారెంట్ ప్రభుత్వ సెలవు రోజున జారీ అయిందని, దానిని ఎనిమిది రోజుల పాటు రహస్యంగా ఉంచారని, ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో విచారణను మార్చుతున్నట్లుగా తనకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తనను అరెస్ట్ చేయడానికి పాకిస్థాన్ రేంజర్లను ఉపయోగించారని తెలిపారు. అరెస్ట్ వారెంట్ అమలు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు పేర్కొన్నదని గుర్తు చేశారు.

ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో తన అరెస్ట్ తన ప్రతిష్ఠకు భంగం కలిగించడమే అన్నారు. నేను అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యానని ప్రపంచానికి చూపించాలనుకున్నారని చెప్పారు. తాను ప్రతి సంవత్సరం చారిటీ కోసం పది బిలియన్ల పాకిస్థానీ రూపాయల్ని విరాళంగా అందుకుంటానని, తన నిజాయతీపై ఎప్పుడూ ప్రశ్న ఎదురు కాలేదన్నారు. కానీ ఇటీవలి తన అరెస్ట్ బోగస్ అన్నారు. నా ప్రతిష్ఠకు భంగం వాటిల్లినందున నా హక్కుల్లో భాగంగా పరువు నష్టం దావా ప్రక్రియను ప్రారంభిస్తానని చెప్పారు.

More Telugu News