Mexico: 45 సంచుల్లో మానవ శరీర భాగాలు.. మెక్సికోలో మళ్లీ వెలుగుచూస్తున్న బ్యాగులు!

  • అదృశ్యమైన ఏడుగురి కోసం గాలిస్తున్న సమయంలో బయటపడిన సంచులు
  • వీరిలో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు
  • 2019, 2021లోనూ లభ్యమైన సంచులు
  • 2016 నుంచి ఇప్పటి వరకు 3.40 లక్షలకు పైగా హత్యలు
45 Bags With Human Body Parts Found In Mexico Ravine

మానవ శరీర భాగాలతో కూడిన 45 సంచులు మెక్సికోలో బయటపడ్డాయి. జలిస్కో రాష్ట్రంలోని రెవైన్‌లో గత వారం అదృశ్యమైన ఏడుగురు యువకుల కోసం గాలిస్తున్న సమయంలో ఇవి వెలుగు చూశాయి. వీటిలో మహిళలు, పురుషుల శరీర భాగాలు కూడా ఉన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. మే 20న అదృశ్యమైన ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషుల కోసం వెతుకుతున్న సమయంలో వీటిని గుర్తించినట్టు పేర్కొన్నారు. వీరి వయసు దాదాపు 30 ఏళ్లు ఉంటుందని తెలిపారు. 

తప్పిపోయిన వారందరూ ఒకే కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు వివరించారు. మానవ శరీర భాగాలతో కనిపించిన సంచులు ఉన్న ప్రాంతంలోనే కాల్ సెంటర్ కూడా ఉందని అధికారులు తెలిపారు. బాధితుల గుర్తింపు కోసం శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. కాల్‌సెంటర్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతుండవచ్చని అధికారులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. 

మరోవైపు, బాధితులను నేరస్తులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, 2021లోనూ జలిస్కో, టోనలాలో 11 మంది శరీర భాగాలతో కూడిన  70 సంచులను గుర్తించారు.  2019లో 29 మంది మంది శరీర భాగాలతో కూడిన 119 సంచులు జపోపాన్ ప్రాంతంలో లభ్యమయ్యాయి. 

డిసెంబరు 2016లో వివాదాస్పద మిలిటరీ మాదకద్రవ్యాల వ్యతిరేక దాడి ప్రారంభించినప్పటి నుంచి మెక్సికోలో 3.40 లక్షల కంటే ఎక్కువ హత్యలు, 10 లక్షల కంటేఎక్కువ మిస్సింగులు నమోదయ్యాయి.

More Telugu News