G.: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి గుస్సా
- గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
- వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు
- నేడు తెలంగాణ ఓ కుటుంబానికి బానిసగా మారే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్య
గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసిన మంత్రి.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం అమరులైన వారిని నేడు స్మరించుకుందాం. ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నమస్సులు’’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దివంగత బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌కు నివాళులు అర్పించిన మంత్రి, చిన్న రాష్ట్రాల వల్లే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నది బీజేపీ విశ్వాసమని చెప్పారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై కూడా కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కుటుంబపాలనతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని, నేడు ఓ కుటుంబానికి తెలంగాణ బానిసగా మారే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం దొరికిన చోటల్లా అప్పులు చేస్తోందని మండిపడ్డ మంత్రి, రాష్ట్రం తెచ్చుకున్నది అప్పుల కోసమా? అని ప్రశ్నించారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో ఫామ్‌హౌస్‌లు పెరుగుతున్నాయే తప్ప డబుల్ బెడ్‌రూంలు ఇవ్వట్లేదని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు పథకంలో అవినీతి, ఆరోగ్యశ్రీ తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.