Arvind Kejriwal: శాంతిభద్రతల బాధ్యత మీదే.. ఏమైనా చేయండి: ఎల్జీకి కేజ్రీవాల్

  • షహాబాద్ ప్రాంతంలో బాలిక దారుణ హత్య నేపథ్యంలో కేజ్రీ ఆగ్రహం
  • బాలిక హత్య దురదృష్టకరమని ట్వీట్
  • ఢిల్లీ ప్రజల భద్రత ముఖ్యమైనదని ఎల్జీకి ట్వీట్
LG law and order is your responsibility says Kejriwal

ఢిల్లీలోని షహాబాద్ ప్రాంతంలో పదహారేళ్ల బాలిక దారుణ హత్య నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మండిపడ్డారు. 'ఢిల్లీలో మైనర్ బాలిక బహిరంగంగా దారుణంగా హత్య చేయబడింది. ఇది చాలా విచారకరం... దురదృష్టకరం. నేరస్తులకు భయం లేకుండా పోయింది. పోలీసులంటే వారికి భయం లేదు. ఎల్జీ సార్.. లా అండ్ ఆర్డర్ మీ బాధ్యత, ఏదైనా చేయండి. ఢిల్లీ ప్రజల భద్రత చాలా ముఖ్యమైనది' అని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసిన కేంద్రం ఆర్డినెన్స్‌పై వివాదం నేపథ్యంలో ఢిల్లీ ఎల్జీని కేజ్రీవాల్ టార్గెట్ చేశారు. శాంతిభద్రతలు, భూమి మినహా అన్ని సేవలపై ఎన్నికైన ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందని మే 11న సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఎల్జీ రాష్ట్రపతి చేత అప్పగించబడిన అడ్మినిస్ట్రేటివ్ రోల్ అధికారాలను నిర్వహిస్తారు.

మరోవైపు, కేజ్రీవాల్ కేబినెట్ సహచరుడు సౌరభ్ భరద్వాజ్ కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు. ఎల్జీ తన పని చేయకపోతే జవాబుదారి ఎవరు అని, ఢిల్లీలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని, పట్టపగలు హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. షహాబాద్‌లో జరిగిన సంఘటన సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఎల్జీ తన విధులను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు.

More Telugu News