Andhra Pradesh: అట్టపెట్టెలతో ఇంట్లోనే భర్త మృతదేహానికి దహన సంస్కారాలు.. కర్నూలులో దారుణం

wife conduct her husband last rites in house at pattikonda
  • కుమారులతో ఆస్తి గొడవల నేపథ్యంలో ఓ తల్లి కఠిన నిర్ణయం
  • ఇంట్లో నుంచి పొగలు రావడంతో పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు
  • అనారోగ్యంతో భర్త చనిపోయాడని పోలీసులకు చెప్పిన వృద్ధురాలు
కర్నూలు జిల్లా పత్తికొండలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో భర్త చనిపోవడంతో ఇంట్లోని అట్టపెట్టెలతో భార్య దహనం చేసింది. సోమవారం ఉదయం వాళ్లింట్లో నుంచి పొగలు వస్తుండడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆరా తీయగా భర్త మృతదేహానికి అంత్యక్రియలు చేసినట్లు వృద్ధురాలు తెలిపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం..

పత్తికొండకు చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్, లలిత భార్యాభర్తలు. పట్టణంలో మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఒకరు కెనడాలో స్థిరపడగా మరొకరు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న హరికృష్ణ ప్రసాద్ సోమవారం ఉదయం చనిపోయారు. దీంతో భర్త మృతదేహానికి లలిత ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించింది. ఇంట్లోని అట్టపెట్టెలను పేర్చి నిప్పంటించింది. ఈ క్రమంలో ఇంట్లో నుంచి భారీగా పొగ రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేశారు. 

పోలీసులు వచ్చి విచారించగా దహన సంస్కారాల విషయం బయటపడింది. అప్పటికే హరికృష్ణ ప్రసాద్ మృతదేహం బూడిదకుప్పగా మారింది. తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కొడుకులు వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారనే ఉద్దేశంతోనే భర్త మృతదేహాన్ని ఇంట్లోనే కాల్చేసినట్లు లలిత పోలీసులకు వెల్లడించింది. చుట్టుపక్కల వారు మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్న హరికృష్ణకు సేవలు చేయలేక లలిత ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని, త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
Andhra Pradesh
karnool
last rites
pattikonda

More Telugu News