UPI Transactions: దేశంలో డిజిటల్ చెల్లింపుల హవా.. వచ్చే ఐదేళ్లలో రోజుకి 100 కోట్లకు చేరిక!

  • యూపీఐ లావాదేవీలపై పీడబ్ల్యూసీ నివేదిక విడుదల
  • 2026-27 నాటికి మొత్తం డిజిటల్ చెల్లింపులు 41,400 కోట్లకు చేరిక
  • ప్రస్తుతం ఏడాదికి 10,300 కోట్ల డిజిటల్ లావాదేవీలు 
UPI to account for 90 percent of retail digital payments in five years

దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. తొలుత చిన్నగా మొదలైన యూపీఐ చెల్లింపులు క్రమంగా పుంజుకున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఇవి రోజుకు 100 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియా ( పీడబ్ల్యూసీ) తెలిపింది. ‘భారత చెల్లింపు హ్యాండ్‌బుక్-2022-27 పేరిట’ ప్రచురించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. గత కొన్నేళ్లుగా భారత్‌లో యూపీఐ చెల్లింపులు నిలకడగా పెరుగుతూ ఏడాదికి సగటున 50 శాతం వృద్ధి సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ రోజువారీ చెల్లింపులు 100 కోట్లకు చేరుకోవచ్చని నివేదిక పేర్కొంది.

2022-23లో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీల వాటా 75 శాతంగా ఉన్నట్టు తెలిపింది. 2026-27 నాటికి మొత్తం డిజిటల్ చెల్లింపులు 41,400 కోట్లకు చేరుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఏడాదికి 10,300 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదవుతున్నట్టు పీడబ్యూసీ నివేదిక వివరించింది. 

క్రెడిట్ కార్డుల విభాగంలో కూడా ఆరోగ్యవంతమైన వృద్ధి నమోదవుతోందని, యూపీఐ తర్వాత ప్రజలు అత్యధికంగా డెబిట్, క్రెడిట్ కార్డులనే ఉపయోగిస్తున్నట్టు తెలిపింది. 2024-25లో డెబిట్ కార్డుల కంటే క్రెడిట్ కార్డుల లావాదేవీలే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. డెబిట్ కార్డులను నగదు ఉపసంహరణకు మాత్రమే వినియోగిస్తుండడం ఇందుకు కారణమని పీడబ్ల్యూసీ తెలిపింది.

More Telugu News