Narendra Modi: మోదీ పిలుపు.. కొత్త పార్లమెంట్ భవనానికి షారుఖ్, అక్షయ్ వాయిస్ ఓవర్‌‌

 PM Modi reacts as Shah Rukh Khan Akshay Kumar post new Parliament videos
  • పార్లమెంట్‌ వీడియోకు వాయిస్ ఓవర్‌‌తో అభిప్రాయాలు పంచుకోవాలన్న మోదీ
  • నూతన భవనాన్ని కొనియాడిన బాలీవుడ్ బడా హీరోలు
  • వారికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు బాలీవుడ్ బడా స్టార్లు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ స్పందించారు. భారత నూతన పార్లమెంటు భవనానికి సంబంధించిన వీడియోను మే 26న సోషల్ మీడియాలో షేర్ చేసిన మోదీ ప్రజలు దీనికి తమ సొంత వాయిస్-ఓవర్‌ ఇవ్వాలని కోరారు. పార్లమెంట్‌ భవనం గురించి తమ అభిప్రాయాలు పంచుకోవాలన్నారు.  మోదీ పిలుపు మేరకు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ తమ వాయిస్-ఓవర్‌తో నూతన పార్లమెంటు భవనం వీడియోను ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. మోదీ వీటిని రీట్వీట్ చేశారు. షారుఖ్ తన వాయిస్ ఓవర్‌లో నూతన పార్లమెంటు భవనం మన ఆశల సౌథమని, మన రాజ్యాంగాన్ని బలపరిచేవారి నివాసమని తెలిపారు. ఇక్కడ 140 కోట్ల మంది భారతీయులు ఒకే కుటుంబంగా నిలుస్తారన్నారు. దీనికి ‘స్వదేశ్’ చిత్రంలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జత చేశారు.

షారుఖ్ ఖాన్ ట్వీట్‌ను మోదీ రీట్వీట్ చేస్తూ, చాలా బాగా చెప్పారని కొనియాడారు. నూతన పార్లమెంటు భవనం ప్రజాస్వామిక బలం, ప్రగతిల చిహ్నమని అన్నారు. పార్లమెంటు నూతన భవనాన్ని చూడటం గర్వకారణమని అక్షయ్ కుమార్ తన వాయిస్ ఓవర్‌‌లో తెలిపారు. దేశ అభివృద్ధికి విశిష్ట చిహ్నంగా ఇది ఎల్లప్పుడూ నిలవాలని ఆకాంక్షించారు. అక్షయ్ కుమార్ ట్వీట్‌ను నరేంద్ర మోదీ రీట్వీట్ చేస్తూ.. ‘మీ ఆలోచనలను చాలా బాగా వెల్లడించారు’ అని ప్రశంసించారు. నూతన పార్లమెంటు భవనం మన ప్రజాస్వామ్యానికి నిజమైన దిక్సూచి అని తెలిపారు. 

కాగా, నూతన పార్లమెంట్ భవన సముదాయం ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం అట్టహాసంగా జరిగింది. లోక్‌ సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్‌ను రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పెదవి విరిచాయి. ప్రారంభోత్సవానికి గైర్హాజరయ్యాయి.
Narendra Modi
Shah Rukh Khan
Akshay Kumar
Parliament

More Telugu News