Nalin Kumar Kateel: ఐదు హామీలు నెరవేరుస్తారా? లేక నిరసనలు ఎదుర్కొంటారా?: కర్ణాటక కాంగ్రెస్ సర్కారుకు రాష్ట్ర బీజేపీ అల్టిమేటం

  • కర్ణాటక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్
  • ఐదు హామీలతో ప్రజలను ఆకట్టుకున్న హస్తం పార్టీ
  • వెంటనే అమలు చేయాలంటున్న ప్రజలు
  • ఇంకా ప్రణాళికే రూపొందించని కాంగ్రెస్ ప్రభుత్వం
  • హామీల అమలుకు నెల రోజుల డెడ్ లైన్ విధించిన విపక్ష బీజేపీ
BJP warns Congress govt in Karnataka should implement five assurances within a month or face protests

ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ప్రధానంగా ఐదు హామీలు దోహదపడ్డాయి. అయితే ఇప్పుడా హామీలే కాంగ్రెస్ కు ఇరకాటంగా మారాయి. 

ఏ రాష్ట్రంలో అయినా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఓ సంవత్సరం వరకు సాఫీగానే ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా నూతన ప్రభుత్వం పట్ల కొన్ని నెలల పాటు ఓపిక వహిస్తాయి. ప్రభుత్వం ఏదైనా తప్పు చేసే వరకు వేచి చూస్తాయి. 

కానీ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిచిన ఆనందాన్ని ఆస్వాదించే పరిస్థితే లేకుండా పోయింది. ప్రజలే మెడ మీద కత్తిపెట్టినట్టే ఐదు హామీల అమలుపై చాలా చోట్ల నిలదీస్తున్నారు. కరెంటు బిల్లులు కూడా చెల్లించడంలేదు. 

5 హామీల్లో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వెంటనే అమలు చేయాలని ప్రజల నుంచే బలమైన డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడా ప్రజా గొంతుకలకు విపక్ష బీజేపీ తోడైంది. 

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు హామీలు అమలు చేస్తారా? లేక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఎదుర్కొంటారా? అంటూ కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ అల్టిమేటం జారీ చేశారు. ఆ హామీలను నెలరోజుల్లో అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అందులో ఏమాత్రం జాప్యం జరిగినా ప్రభుత్వానికి నిరసన సెగలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఐదు హామీలపై క్షేత్రస్థాయిలో అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని, ఆ తర్వాతి వంతు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలదేనని కతీల్ అన్నారు.

More Telugu News