Pawan Kalyan: పాముకాటుతో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి తగినంత నష్ట పరిహారం ఇవ్వాలి: పవన్ కల్యాణ్

  • ఇటీవల అమరావతి ఆర్-5 జోన్ లో ఘటన
  • బందోబస్తు కోసం వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ కు పాముకాటు
  • చికిత్స పొందుతూ కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి
  • ఈ ఘటన తెలిసి చాలా బాధ అనిపించిందన్న పవన్ కల్యాణ్
Pawan Kalyan suggests govt should pay compensation for constable Pawan Kumar family

కొన్నిరోజుల కిందట ఆర్-5 జోన్ లో బందోబస్తు విధుల నిర్వహణకు వచ్చిన ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ పవన్ కుమార్ పాముకాటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పాముకాటుకు గురై కానిస్టేబుల్ పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం విచారకరం అని పేర్కొన్నారు. 

ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి బందోబస్తు కోసం వచ్చి పాముకాటుతో పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసి చాలా బాధ అనింపించిందని పేర్కొన్నారు. బందోబస్తు కోసం వచ్చిన వారు ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ తెలిపారు. 

డ్యూటీలో ఉన్న వారికి వసతుల లేమి ఉన్న విషయం ఈ సంఘటనతో తేటతెల్లమవుతోందని వెల్లడించారు. బయట ప్రాంతాలకు విధుల నిమిత్తం వెళుతున్న పోలీస్ సిబ్బందికి భోజన, వసతి సదుపాయాలు ఎలా ఉంటున్నాయి? అనే విషయమై ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో మదింపు జరగాల్సి ఉందని పవన్ కల్యాణ్ సూచించారు. 

ప్రాణాలు కోల్పోయిన పవన్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు. పవన్ కుమార్ కుటుంబానికి తగినంత నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు.

More Telugu News