Chinmayi Sripaada: అప్పుడు ఎక్కడికి పోయారు కమల్ హాసన్ గారూ?: గాయని చిన్మయి

  • తమిళ పరిశ్రమలో ఓ గాయనిని నిషేధించి ఐదేళ్లు అయిందన్న చిన్మయి
  • కళ్ల ముందు జరిగే వాటిని పట్టించుకోరు.. భద్రత గురించి మాట్లాడతారని విమర్శ
  • తనకు మద్దతు ఇవ్వనందుకు నిలదీసిన గాయని
Chinmayi Sripaada slams Kamal Haasan for his silence over her Me Too allegations reacts to his wrestlers protest tweet

కమల్ హాసన్  మంచి నటుడిగా ఎప్పుడో గుర్తింపు సంపాదించేశారు. కాకపోతే ఇప్పుడు ప్రజా నేతగా నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. తమిళనాడులో మక్కల్ నీది మయ్యం పేరుతో ప్రాంతీయ పార్టీ పెట్టి అధికారం సంపాదించాలని ఆశపడ్డారు. కానీ, తమిళ ప్రజలు ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో అప్పుడప్పుడు జాతీయ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. వీలు చిక్కినప్పుడు బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలో కమల్ హాసన్ తాజాగా చేసిన ఓ ప్రకటన నేపథ్యంలో, ఆయన వ్యవహార శైలిని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద నిలదీసినంత పనిచేసింది.

జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు (మల్లయోధులు) కొంత కాలంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం తెలిసిందే. వీరికి కమల్ హాసన్ మద్దతు తెలుపుతూ బుధవారం ఓ ట్వీట్ చేశారు.  ‘‘రెజ్లర్లు నిరసనలు వ్యక్తం చేయడం మొదలు పెట్టి నేటికి నెల పూర్తయింది. దేశ కీర్తి కోసం పోరాటం చేయాల్సిన వారిని సొంత భద్రత కోసం పోరాడేలా చేశాం. జాతీయ క్రీడా చిహ్నాలా? లేక ఎంతో నేర చరిత్ర కలిగిన రాజకీయ నేతా.. మన దృష్టిని ఆకర్షించేది ఎవరు?‘‘ అంటూ కమల్ ట్వీట్ వదిలారు.

కమల్ హాసన్ ధోరణిని ఈ ట్వీట్ ఆధారంగా చిన్మయి తీవ్రంగా విమర్శించింది. తమిళ గీత రచయిత వైరముత్తు పనిలో భాగంగా తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు  మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి అప్పట్లో సంచలన ఆరోపణలు చేసింది. స్పందించకుంటే కెరీర్ ముగిసిపోతుందని బెదిరించాడని ప్రకటించింది. ఈ ఆరోపణల తర్వాత తనను తమిళ మ్యూజిక్ పరిశ్రమ నుంచి నిషేధిస్తే అప్పుడు కమల్ హాసన్ మద్దతు ఎక్కడికి పోయిందంటూ చిన్మయి ప్రశ్నించింది. 

‘‘లైంగికంగా వేధించిన వ్యక్తి పేరు చెప్పినందుకు తమిళనాడులో ఓ గాయనిని నిషేధించి ఐదేళ్లు అయింది. తమ కళ్ల ముందే వేధింపులను చూస్తూ పట్టించుకోని రాజకీయ నాయకులు మహిళల భద్రత గురించి మాట్లాడితే ఎవరు విశ్వసిస్తారు?‘‘ అని చిన్మయి ప్రశ్నించింది. తమ అజెండాకు సరిపోతుందని భావిస్తేనే రాజకీయ నాయకులు మాట్లాడతారంటూ ఓ యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.

More Telugu News