YS Jagan: నరకాసురుడినైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జగన్

  • వెంకటాయపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన జగన్
  • చంద్రబాబు, పవన్, ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతిని గజదొంగల ముఠాగా అభివర్ణించిన సీఎం
  • మేనిఫోస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ కంటే పవిత్రంగా చూస్తామన్న జగన్
  • ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామన్న సీఎం
Dont believe Chandrababu says YS Jagan

ఏపీ రాజధానిలోని వెంకటాయపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, టీవీ5 న్యూస్ చానల్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. వాటిని గజదొంగల ముఠాగా అభివర్ణించారు. నరకాసురుడ్ని అయినా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మడానికి వీల్లేదని అన్నారు. 

ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేసినట్టు చెప్పారు. 30 లక్షలమందికిపైగా అక్కచెల్లెమ్మలకు పట్టాలు అందించామని పేర్కొన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి అమలు చేస్తున్నట్టు తెలిపారు. నాలుగేళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. 

చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఎన్నికలు రాగానే మోసపూరిత హామీలు ఇస్తారని, ఆయనను నమ్మొద్దని కోరారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల విషయంలోనూ చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, మహిళల పేరుమీదే పట్టాలు ఉంటాయని అన్నారు. 

వారి చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల సంపద ఉందని జగన్ పేర్కొన్నారు. ఇళ్లు నిర్మించే కార్యక్రమం కూడా ఈ వారంలోనే ప్రారంభమవుతుందని, మూడు పద్ధతుల్లో ఇళ్లు నిర్మిస్తామని వివరించారు. తొలి విధానంలో సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి రూ. 1 లక్షా 80 వేలు ఇస్తామని, రెండ విధానంలో నిర్మాణ కూలీ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.

తాను ఇస్తున్నవి ఇళ్ల పట్టాలు మాత్రమే కావని, సామాజిక న్యాయ పత్రాలని జగన్ అన్నారు. అమరావతి ఇకపై సామాజిక అమరావతి అవుతుందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించినట్టు జగన్ వివరించారు.

More Telugu News