Narendra Modi: ఇండియాలో దిగగానే ప్రతిపక్షాలకు పంచ్ ఇచ్చిన ప్రధాని మోదీ

PM Modis veiled attack on parties boycotting Parliament event
  • మూడు దేశాల పర్యటన అనంతరం గురువారం ఇండియాలో దిగిన ప్రధాని
  • పాళం ఎయిర్‌పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం
  • పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్ చేస్తున్న ప్రతిపక్షాలపై ఎయిర్‌పోర్టులోనే విసుర్లు
  • ఆస్ట్రేలియాలో పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి తన కార్యక్రమాలకు హాజరైన విషయం ప్రస్తావన
మూడు దేశాల పర్యటన పూర్తి చేసుకుని గురువారం భారత్‌‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్షాలపై పంచ్‌లు విసిరారు. మీడియాతో తన ఆస్ట్రేలియా పర్యటన గురించి మోదీ ప్రస్తావించారు. అక్కడ తన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ప్రతిపక్షాలు, మాజీ ప్రధాని కూడా హాజరయిన విషయాన్ని పేర్కొన్నారు. దేశం కోసం వారందరూ ఒక్కటిగా నిలిచారంటూ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలపై పరోక్షంగా చురకలు వేశారు. 

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభించనున్న కారణంగా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రతిపక్షాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశాధినేత అయిన రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభోత్సవం జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మే 28న నూతన భవనాన్ని మోదీ ప్రారంభించనున్నారు.  

జపాన్, పాపువా న్యూగినియా, ఆస్ట్రేలియా దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీకి గురువారం పాళం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

ఈ సందర్భంగా అక్కడి జనసందోహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచం ముందు నా దేశ కీర్తిప్రతిష్ఠలను ఎటువంటి సంకోచం లేకుండా సగర్వంగా ఎలుగెత్తి చాటుతాను. మీరందరూ నన్ను పూర్తి మెజారిటీతో ఎన్నుకోవడమే దీనికి కారణం. నేను మాట్లాడిన ప్రతిసారీ ప్రపంచం నా మాటలనే కాదు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న 140 కోట్ల మంది ప్రజల మాటలను విశ్వసిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Narendra Modi

More Telugu News