physical activity: రక్తపోటును తగ్గించే అద్భుతమైన ఔషధం ఇదే..!

Doctor suggests one miracle medicine for high blood pressure
  • రోజువారీ వ్యాయామం చేయడమే అద్భుతమైన ఔషధం
  • దీనివల్ల మెరుగైన రక్త ప్రసరణకు వీలు
  • బీపీలో 10 పాయింట్ల వరకు తగ్గించుకోవచ్చు
అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ నేడు ఎక్కువ మందిలో కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. 30 ఏళ్ల నుంచే ఈ సమస్య కనిపిస్తోంది. కనుక దీన్ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే అది గుండె, మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. జీవనశైలి సమస్యల్లో భాగమైన రక్తపోటును అదుపులో పెట్టుకునేందుకు మేదాంతా గురుగ్రామ్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం డైరెక్టర్ సంజయ్ మిట్టల్ పలు సూచనలు చేశారు. రక్తపోటుతో బాధపడే వారికి అద్భుతమైన ఔషధం శారీరక శ్రమేనని ఆయన తెలిపారు. రక్తపోటును అదుపు చేసి, గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుందని చెబుతున్నారు. 

వ్యాయామం చేయడం వల్ల సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు తగ్గుతుంది. ఇందులో సిస్టోలిక్ అనేది గుండె కొట్టుకున్నప్పుడు రక్త నాళాలపై పడే ఒత్తిడి. బీపీ రీడింగ్ లో ఎగువ స్థాయిలో ఉండేది సిస్టోలిక్. డయాస్టోలిక్ అనేది బీపీ రీడింగ్ లో దిగువ స్థాయిలోనిది. గుండె బీటింగ్ కు బీటింగ్ కు మధ్య విశ్రాంతి సమయంలో ఉండే రేటు ఇది. రోజువారీ వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు 5-10 పాయింట్ల మేర తగ్గుతుంది. 

వ్యాయామం చేయడం వల్ల గుండె కండరాలు బలోపేతం అవుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. దీంతో అథెరోస్కెలరోసిస్ రిస్క్ తగ్గుతుంది. వ్యాయామంతో మనలోని ఒత్తిళ్లు, ఆందోళన తగ్గుతాయి. దాంతో అది బీపీ తగ్గేందుకూ సాయపడుతుంది. ఇక బరువు తగ్గడం మరో మార్గం. అధిక బరువు రక్తపోటుకు దారితీస్తుంది. కనుక వ్యాయామంతో బరువు తగ్గించుకోవచ్చు. దీనివల్ల బీపీ రిస్క్ కూాడా తగ్గుతుంది. 

వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది రక్తంలో షుగర్ ను నియంత్రించడానికి కీలకం అవుతుంది. టైప్-2 డయాబెటిస్ అనేది రక్తపోటుకు రిస్క్ ఫ్యాక్టర్ అని మరిచిపోవద్దు. రక్త నాళాల లోపలి గోడల (ఎండోథీలియం) పనితీరు వ్యాయామంతో బలపడుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ మరింత మెరుగ్గా, అవాంతరాల్లేకుండా సాగుతుంది. దీంతో గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. 

ఇవి చేయొచ్చు..
  • బ్రిస్క్ వాక్ మంచి ఆలోచన అవుతుంది. రక్త ప్రసరణ దీనివల్ల మెరుగుపడుతుంది. ఫలితంగా బీపీ, గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. 
  • సైక్లింగ్ మంచి ఏరోబిక్ వ్యాయామం. గుండె, ఊపిరితిత్తులు బలపడతాయి. 
  • అలాగే స్విమ్మింగ్ కూడా మంచి వ్యాయామం అవుతుంది. గుండె జబ్బుల రిస్క్ చాలా వరకు స్విమ్మింగ్ తో తగ్గుతుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. రక్తపోటు మంచి నియంత్రణలోకి వస్తుంది. 
  • ఇక యోగాసనాలు కూడా మంచి వ్యాయామమే. మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. బీపీ అదుపులోకి వస్తుంది.
physical activity
miracle medicine
blood pressure
hypertension
doctors

More Telugu News