YS Jagan: ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికీ ప్రభుత్వం తోడుంటుంది: 'జగనన్న విద్యా దీవెన' నిధుల విడుదల కార్యక్రమంలో ఏపీ సీఎం

jagananna vidya deevena funds released by ap cm jagan in kovvuru

  • కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి
  • ప్రతీ ఇంటి నుంచి ఓ సత్య నాదెళ్ల రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడి
  • ప్రభుత్వ స్కూళ్లలో చదువుల రూపురేఖలు మార్చేశామని వివరణ

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిభావంతులైన ప్రతీ విద్యార్థికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, గొప్పవారు కావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో బుధవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.703 కోట్ల నిధులను నేరుగా జమ చేశారు.

అనంతరం జగన్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలను మార్చేసే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వ విద్యాలయాలను, వాటిలో బోధనా పద్ధతుల రూపురేఖలను సమూలంగా మార్చేశామని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లతో పోటీపడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దామని, క్లాస్ రూమ్ లలో డిజిటల్ బోధనకు రూపకల్పన చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటి నుంచి ఓ సత్య నాదెళ్ల రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ప్రతిభ కల విద్యార్థులు విదేశాలలో చదివేందుకు తమ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయని, అందుకే విద్యపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని తెలిపారు. విద్యా దీవెన కింద ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వివరించారు. ఈ ఖర్చును హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ గా ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. జగనన్న పాలనలో విద్యాశాఖలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. విద్యను పేదవాడి హక్కుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని అన్నారు.

విద్యా దీవెన పథకం..
రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే విద్యా దీవెన.. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు కాలేజీ ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఫీజుల మొత్తాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లో వేస్తోంది.

YS Jagan
YSRCP
Andhra Pradesh
vidya deevena
Funds released
kovvuru
  • Loading...

More Telugu News