WHO: మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలి: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
- కొవిడ్ కంటే ప్రమాదకరమైన మహమ్మారి పుట్టుకొచ్చే అవకాశం ఉందన్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్
- రాబోయే విపత్తుకు మానవాళి సిద్ధంగా ఉండాలని హెచ్చరిక
- 76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ వ్యాఖ్యలు
కొవిడ్ కంటే ప్రమాదకరమైన మహమ్మారి పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోం తాజాగా హెచ్చరించారు. రాబోయే మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ‘‘కొవిడ్‌పై అత్యయిక స్థితి ఎత్తేసినంత మాత్రాన కొవిడ్ ముప్పు అంతమైనట్టు కాదు’’ అని టెడ్రోస్ పేర్కొన్నారు. 76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో టెడ్రోస్ తాజాగా ప్రపంచ ఆరోగ్య పరిస్థితులపై తన నివేదికను సమర్పించారు. ‘‘కొత్త వేరియంట్ల కారణంగా మరో మహమ్మారి పుట్టుక, మరణాలు సంభవించే అవకాశం ఇంకా మిగిలే ఉంది. కొవిడ్ కంటే ప్రాణాంతకమైన వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు.
వివిధ రకాల సమస్యలు మూకుమ్మడిగా పుట్టుకొస్తున్న నేపథ్యంలో అన్ని సందర్భాలకూ తగిన ప్రపంచ స్థాయి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు. ‘‘మరో సంక్షోభం కచ్చితంగా వస్తుంది. అప్పుడు దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సమన్యాయంతో ఉమ్మడిగా నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని పిలుపునిచ్చారు.