Bareilly: పారిపోబోయిన వరుడు.. వెంటాడి పట్టుకొచ్చిన వధువు!

Bareilly bride chases man running away from marriage for 20 kms drags him back to mandap
  • యూపీలోని బారాదరిలో చోటు చేసుకున్న ఘటన
  • పెళ్లి ముహూర్తం సమీపిస్తున్నా జాడలేని వరుడు
  • కాల్ చేసి కనుక్కోగా కట్టుకథ వినిపించడంతో వధువుకు అనుమానం
  • బస్సులో పారిపోతుండగా, పట్టుకుని వచ్చి పెళ్లి కానిచ్చిన వధువు 
క్వీన్ సినిమా చూసిన వారికి, అందులో రాణి పాత్రలో కంగనా రనౌత్ ఎదుర్కొన్న చిత్రమైన పరిస్థితి గుర్తుండే ఉంటుంది. తన భర్త వివాహం తర్వాత పారిపోతే, కంగనా ఒంటరిగా హనీమూన్ కు వెళుతుంది. కానీ, ఉత్తప్రదేశ్ లోని బరేలీకి చెందిన ఈ రాణి మాత్రం కంగనాకు విరుద్ధం. కంగనా మాదిరి కట్టుకోబోయే వాడు పారిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. వెంటాడి పట్టుకొచ్చి మరీ మనువాడింది. 

యూపీలోని బారాబంకి పోలీసు స్టేషన్ పరిధిలో బారాదరి ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. సదరు వధువు రెండున్నరేళ్లుగా ఓ వ్యక్తితో అనుబంధం సాగిస్తోంది. ఇరు వైపుల కుటుంబాల అంగీకారంతో పెళ్లి కుదిరింది. గత ఆదివారం భూతేశ్వర్ నాథ్ ఆలయంలో వీరికి వివాహం ఏర్పాటు చేశారు. కానీ, వివాహ ముహూర్తం సమీపించినా అక్కడ వరుడి జాడ లేదు. వధువు తనను మనువాడబోయే వాడి కోసం వేచి చూసి చూసి ఇక లాభం లేదనుకుని కాల్ చేసింది.

తనను క్షమించాలని, తన తల్లిని తీసుకువచ్చేందుకు బుదాన్ వెళుతున్నట్టు చెప్పాడు. దీంతో పెళ్లి కూతురికి అనుమానం కలిగింది. ఆమె ఆలస్యం చేయకుండా తన వాళ్లను వెంట పెట్టుకుని వరుడి కోసం వేటాడుతూ వెళ్లింది. బరేలీకి 20 కిలోమీటర్ల దూరంలో భిమోర పోలీసు స్టేషన్ పరిధిలో అతడ్ని పట్టుకుంది. ఓ బస్సు ఎక్కుతుండగా అతడ్ని పట్టుకుని పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. ఇంకేముంది.. మూడు ముడ్లు, మేళతాళాలు, అక్షింతలతో వివాహం ముగిసింది. తాను సబలనని వధువు నిరూపించుకుంది.
Bareilly
bride
chases
catch bride groom
running away
wedding

More Telugu News