Night shift: రాత్రి డ్యూటీలతో అనారోగ్య సమస్యలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

  • రాత్రి సమయంలో టీ, కాఫీలకు దూరంగా ఉండాలి
  • రోజూ ఒకే సమయంలో నిద్రించి, లేవడం అలవాటు చేసుకోవాలి
  • పోషకాహారం, వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలి
Night shift taking a toll on your health Follow these simple tips

రాత్రి డ్యూటీలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీర్ఘకాల వ్యాధులకు నైట్ షిప్ట్ లు కారణమవుతాయని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. కానీ, కార్పొరేట్ సంస్కృతితో, ప్రపంచీకరణతో రాత్రి ఉద్యోగాలు లక్షల సంఖ్యలో వచ్చేశాయి. ఎంతో మంది ఈ విధంగా ఉపాధి పొందుతున్నారు. అయితే, రాత్రి సమయంలో ఉద్యోగాలు చేయడం వల్ల నిద్ర ప్యాటర్న్ దెబ్బతింటుంది. సర్కాడియం రిథమ్ లో మార్పులు చోటు చేసుకుంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు రిస్క్ ఉంటుంది. మరి ఈ ప్రభావాలను అధిగమించేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో చూద్దాం..

రాత్రి నిద్ర సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. నిద్రలో జరగాల్సిన ఎన్నో ముఖ్యమైన విధులు ఆలస్యం అవుతాయి. జీవక్రియలు దెబ్బతింటాయి. హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. మానసిక ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ నష్టాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

నైట్ డ్యూటీకి వెళ్లే ముందు మిల్లెట్స్ ఆహారం తీసుకోవాలి. దీనివల్ల రాత్రి పూట అనవసరమైన తిండిని తగ్గించొచ్చు. రాత్రి సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవద్దు. రాత్రి షిప్ట్ లలో భాగంగా కాఫీ, టీలు తాగుతుంటారు. కానీ వీటికి దూరంగా ఉండాలి. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పైగా డ్యూటీ తర్వాత నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఎదురుకావచ్చు. డీహైడ్రేషన్ కలుగుతుంది. వీటికి బదులు మజ్జిగ తాగొచ్చు. రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న తర్వాత గోరువెచ్చని పాలను తాగాలి. వేసవిలో అరటిపండు లేదా మామిడి పండు తిని పడుకోవచ్చు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల వెన్నెముకపై ప్రభావం తగ్గించుకోవచ్చు. 

రాత్రి డ్యూటీ అయినా సరే ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ప్రతి రోజూ ఓ నిర్ణీత వేళల్లోనే నిద్రించేలా చూసుకోవాలి. అంటే ఒకే సమయంలో నిద్రించి, ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరంలో నిద్ర సమయంలో జరగాల్సిన జీవక్రియలకు ఇబ్బంది ఉండదు. సర్కాడియమ్ రిథమ్ అస్తవ్యస్తం కాకుండా చూసుకోవచ్చు. అలాగే నాణ్యమైన నిద్రకు వీలుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాలి. నాణ్యమైన పరుపుకు ప్రాధాన్యం ఇవ్వాలి. తగినంత నీరు తీసుకోవాలి. పోషకాహారానికి ప్రాధాన్యం ఇస్తూ.. రోజువారీ తప్పకుండా వ్యాయామం చేయాలి.

More Telugu News