Raghu Rama Krishna Raju: సాయంత్రంలోగా అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం: రఘురామకృష్ణరాజు

  • ఏపీ పోలీసులు చిల్లరగా వ్యవహరిస్తున్నారన్న రఘురాజు
  • పులివెందుల నుంచి వచ్చిన ఆకు రౌడీలను అరెస్ట్ చేయలేరా? అని ప్రశ్న
  • తనలాంటి వాళ్లను వేసుకెళ్లడానికే పోలీసులు ఉన్నారా? అని ఆగ్రహం
Today YS Avinash Reddy will be arrested says Raghu Rama Krishna Raju

వివేకా హత్య కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పిటిషన్ విచారణను ఈరోజు వెకేషన్ బెంచ్ స్వీకరించలేదు. మెన్షనింగ్ ఆఫీసర్ ముందు కేసును మెన్షన్ చేయాలంటూ ధర్మాసనం అవినాశ్ లాయర్ కు సూచించింది. మెన్షనింగ్ లిస్ట్ లో ఉంటేనే కేసును విచారిస్తామని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. 

ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ... అవినాశ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడానికి అడ్డంకి తొలగినట్టేనని చెప్పారు. డీఐజీ, ఏపీ పోలీసులు చాలా చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు ఆసుపత్రి వద్ద కడప, పులివెందుల నుంచి వచ్చి 10 మంది ఆకు రౌడీలు ఉంటే వారిని అరెస్ట్ చేయలేరా? అని ప్రశ్నించారు. తమలాంటి వాళ్లను వేసుకెళ్లడానికే ఈ పోలీసులు ఉన్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రంలోగా అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమని చెప్పారు. అవినాశ్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కర్నూలు ఎస్పీ, డీఐజీ వంటి అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలని అన్నారు.

More Telugu News