Russia: కీలక ఉక్రెయిన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామన్న రష్యా.. ఖండించిన ఉక్రెయిన్

  • బాఖ్మత్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రైవేటు దళం వాగ్నర్ గ్రూప్ ప్రకటన
  • శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్
  • రష్యా ప్రకటనను ఖండించిన ఉక్రెయిన్ మిలిటరీ ప్రతినిధి
  • తమ దళాలు ఇంకా  నగరంలోనే ఉన్నాయని స్పష్టీకరణ
Ukraine rubbishes claims of russia capturing bakhmut

తూర్పు ఉక్రెయిన్‌లో కీలక నగరమైన బాఖ్మత్‌ను స్వాధీనం చేసుకున్నామని రష్యా శనివారం ప్రకటించింది. తమ దళాలు నగరాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నాయని రష్యా తరఫున పోరాడుతున్న ప్రైవేటు మిలిటరీ దళం వాగ్నర్‌ గ్రూప్ కమాండర్ యెవ్‌జ్నీ ప్రిగోజిన్ ప్రకటించారు. సిటీలో మిగిలిన ఉక్రెయిన్ దళాలను కూడా తరిమేశామని చెప్పుకొచ్చారు. బాఖ్మత్‌ను స్వాధీనం చేసుకున్న దళాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ యుద్ధంలో అసాధారణ ధైర్యసాహసాలు కనబరిచిన వారికి అవార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. 

వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ మిలిటరీ ప్రతినిధి ఖండించారు. ‘‘ అది వాస్తవం కాదు. మా దళాలు బాఖ్మత్‌లో ఉంటూ యుద్ధం కొనసాగిస్తున్నాయి’’ అని చెప్పారు. అయితే, బాఖ్మత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రి హాన్నా మాలియార్ వ్యాఖ్యానించడం గమనార్హం. నగరంలో ఉన్న తమ దళాలు రష్యా దాడులకు ఎదురొడ్డి నిలుస్తున్నాయని చెప్పారు. 

ఉక్రెయిన్‌లో కీలక భూభాగమయిన డాన్బాస్ ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకునేందుకు బాఖ్మత్‌పై నియంత్రణ కీలకమని రష్యా భావిస్తోంది. బాఖ్మత్ కేంద్రంగా దాడులు చేస్తూ డాన్బాస్‌లోకి మరింతగా చొచ్చుకెళ్లొచ్చని నమ్ముతోంది. డాన్బాస్ మొత్తం తమదేనని రష్యా గతంలోనే ప్రకటించుకుంది.

More Telugu News