Prakasam District: రాధ హత్యకేసులో ఊహించని మలుపు.. కిరాతక హత్య భర్త పనే!

  • ప్రకాశం జిల్లా జిల్లెళ్లపాడు శివారులో హత్య
  • స్నేహితుడితో సన్నిహితంగా ఉంటోందనే కిరాతకం
  • కాశిరెడ్డి పేరుతో సిమ్‌కార్డు కొని భార్యతో చాటింగ్
  • డబ్బులు ఇస్తానని పిలిపించి దారుణం
Unexpected twist in Kota Radha murder case husband killed her

కోట రాధ (35) హత్య కేసులో మిస్టరీ వీడిపోయింది. ప్రకాశం జిల్లా జిల్లెళ్లపాడు శివారులో జరిగిన ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దుండగులు రాధను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తొలుత కారుతో కాళ్లపై తొక్కించి, ఆపై సిగరెట్లతో వాతలు పెట్టి, బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయం వెలుగుచూసింది. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసింది భర్త కోట మోహన్‌రెడ్డేనని పోలీసులు నిర్ధారించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నిన్న సాయంత్రం రాధ అంత్యక్రియలు ముగిసిన తర్వాత మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రకాశం జిల్లాకు తరలించారు. 

అనుమానంతోనే..
ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్న స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డిని ఆదుకునే ఉద్దేశంతో రాధ అతడికి రూ. 80 లక్షల వరకు అప్పు ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. దీనికి తోడు  కాశిరెడ్డితో భార్యకు సన్నిహిత సంబంధం ఉందని మోహన్‌రెడ్డి అనుమానించాడు. దీంతో కాశిరెడ్డి పేరిట సిమ్‌కార్డు కొని భార్యతో చాటింగ్ చేశాడు. డబ్బులిస్తానని చెప్పి ఈ నెల 17న స్వగ్రామమైన ప్రకాశం జిల్లాలోని కనిగిరి రప్పించాడు. ఆ తర్వాత మరికొందరితో కలిసి అత్యంత కిరాతకంగా భార్యను హత్య చేశాడు. 

కనిగిరి పామూరు బస్టాండు సెంటరులో వేచి ఉన్న రాధను ఎక్కించుకుని వెళ్లిన ఎరుపు కారు హైదరాబాద్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. రాధ హత్య తర్వాత మోహన్‌రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడాన్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఈ హత్య వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో  పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News