CSK: ఢిల్లీని చుట్టేసి... ప్లేఆఫ్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్

CSK seals play off berth by beating DC

  • ఐపీఎల్ లో 12వ పర్యాయం ప్లే ఆఫ్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్
  • నేడు ఢిల్లీ క్యాపిటల్స్ పై 77 పరుగుల తేడాతో విజయం
  • మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు
  • లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసిన ఢిల్లీ

ఐపీఎల్-16లో ప్లే ఆఫ్ దశకు చేరుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండ్ షో అంటే ఎలా ఉంటుందో చూపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను వారి సొంతగడ్డపైనే 77 పరుగుల భారీ తేడాతో ఓడించింది. తద్వారా ప్లే ఆఫ్ బెర్తును సగర్వంగా కైవసం చేసుకుంది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది. అనంతరం, 224 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. 

కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటరిపోరాటం చేశాడు. అతడికి సహకారం అందించేవాళ్లే కరవయ్యారు. భారీ షాట్లతో విరుచుకుపడిన వార్నర్ 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 86 పరుగులు చేశాడు. ఓపెనర్ గా దిగిన వార్నర్ ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ 3, మహీశ్ తీక్షణ 2, పతిరణ 2, తుషార్ దేశ్ పాండే 1, జడేజా 1 వికెట్ తీశారు. కాగా, ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ప్లే ఆఫ్ చేరడం ఇది 12వ సారి. 

ఇక, నేడు జరిగే రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే లక్నో జట్టు ప్లే ఆఫ్ బెర్తు ఖరారవుతుంది.

  • Loading...

More Telugu News