DK Shivakumar: విధాన సౌధ మెట్లకు మొక్కిన డీకే శివకుమార్.. వీడియో ఇదిగో!

as a sign of respect dk shivakumar bows on karnataka vidhan soudha steps
  • డిప్యూటీ సీఎంగా ఈ రోజు ప్రమాణస్వీకారం చేసిన డీకే శివకుమార్
  • సీఎం సిద్ధూతో కలిసి కేబినెట్ సమావేశం కోసం విధాన సౌధకు రాక
  • మెట్లకు తలను ఆనించి, తర్వాత రెండు చేతులెత్తి నమస్కరించిన డీకే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. సీఎం పదవిని ఆశించిన ఆయన.. అధిష్ఠానం నిర్ణయంతో ఒకమెట్టు దిగి డిప్యూటీ సీఎంగా ఈ రోజు బాధ్యతలు చేపట్టారు.

సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే, 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. అందరూ తొలి కేబినెట్‌ మీటింగ్‌ కోసం విధాన సౌధకు చేరుకున్నారు. అయితే విధాన సౌధలోకి వెళ్లేముందు ఆయన చేసిన చర్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలుత సిద్ధూ, డీకే ఒకేసారి అక్కడికి విధాన సౌధ మెట్ల దగ్గరికి వచ్చారు.

సిద్ధూ ముందుకు వెళ్లిపోగా.. శివకుమార్ మెట్ల దగ్గరే ఆగిపోయారు. గౌరవ సూచికంగా ఒంగిన ఆయన.. తన తలను విధాన సౌధ మెట్లకు ఆనించారు. తర్వాత రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. లోపలికి వెళ్లే ముందు మీడియాకు విక్టరీ సింబల్‌ చూపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

అంతకుముందు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్‌ తావర్‌ చంద్‌ గెహ్లాట్‌ తొలుత సిద్ధరామయ్యతో, తర్వాత డీకే శివకుమార్‌ తో ప్రమాణం చేశారు. అనంతరం ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కేబినెట్‌ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమం ప్రతిపక్షాల బలప్రదర్శనలా సాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రతిపక్షాల పార్టీల నాయకులు హాజరయ్యారు.
DK Shivakumar
Vidhan Soudha
Congress
Karnataka
Siddaramaiah

More Telugu News