Rajasthan: రాజస్థాన్ ప్రభుత్వ బిల్డింగ్ బేస్ మెంట్ లో నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు!

  • రాజస్థాన్ లోని ఓ ప్రభుత్వ భవనంలో రూ.2.31 కోట్లు, కిలో బంగారం స్వాధీనం 
  • బేస్‌మెంట్‌లో అల్మారాలోని బ్యాగ్‌లో ఉంచినట్లు గుర్తించిన సిబ్బంది
  • 7-8 మంది ఉద్యోగులను ప్రశ్నిస్తున్న పోలీసులు
Cash and Gold Worth Crores Found In Rajasthan Government Buildings Basement

రాజస్థాన్ లోని ఓ ప్రభుత్వ భవనం బేస్ మెంట్ లో నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌లో ఓ అల్మారాలో రూ.2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌కు వెళ్లే అధికారం ఉన్న 7-8 మంది ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు.

శుక్రవారం రాత్రి ఘటన గురించిన సమాచారం తెలియగానే.. అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉషా శర్మ, డీజేపీ ఉమేష్ మిశ్రా, ఏడీజీపీ దినేశ్, జైపూర్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ.. విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఐటీ శాఖ అదనపు డైరెక్టర్ మహేశ్ గుప్తా ఇచ్చిన సమాచారం మేరకు డబ్బు, బంగారాన్ని జప్తు చేసినట్లు వారు తెలిపారు.

‘‘ప్రభుత్వ కార్యాలయమైన యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌లో అల్మారాలో ఉంచిన బ్యాగ్‌లో సుమారు రూ.2.31 కోట్ల నగదు, 1 కిలో బంగారు బిస్కెట్లు లభించాయి. ఈ నోట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించాం. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. ఇదే విషయమై సీఎం అశోక్ గెహ్లాట్‌కు కూడా సమాచారం అందించాం’’ అని ఆనంద్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. 

‘‘ఒక అల్మారాలో ఫైళ్లు లభించాయి. మరో అల్మారాలో సూట్‌కేసులో ఉంచిన కరెన్సీ కట్టలు, బంగారం దొరికాయి. వెంటనే ఉద్యోగులు ఈ విషయంపై పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. నగదు లభించిన అల్మారా చాలా ఏళ్లుగా మూతపడి ఉంది’’ అని వివరించారు.

More Telugu News