Indian cities: స్ట్రీట్ ఫుడ్ లో ఈ రెండు భారత పట్టణాలకు అంతర్జాతీయ గుర్తింపు

Two Indian cities make it to the list of worlds top places with best local food
  • వరల్డ్ టాప్ 100లో ఢిల్లీ, ముంబై
  • ఢిల్లీకి 16, ముంబైకి 34వ స్థానం
  • ఢిల్లీలో ఛోలే బాచుర్, బటర్ చికెన్, ఆలూ టిక్కి ఫేమస్
  • ముంబైలో వడా పావ్, పావ్ బాజీ, భేల్ పూరి పాప్యులర్
రుచికరమైన పదార్థాల పట్ల పట్టణ వాసులు మక్కువ చూపిస్తుంటారు. మంచి స్ట్రీట్ ఫుడ్ (వీధి ఆహారం) ఎక్కడ లభిస్తే అక్కడ రద్దీ విపరీతంగా కనిపిస్తుంది. పర్యాటకులు ఎక్కడికి వెళ్లినా అక్కడ మాత్రమే ప్రత్యేకంగా లభించే స్ట్రీట్ ఫుడ్ కు ప్రాధాన్యం ఇస్తుంటారు. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ పరంగా రెండు పట్టణాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా లోకల్ ఫుడ్ పరంగా పేరొందిన టాప్ 100 పట్టణాల జాబితాను ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆన్ లైన్ గైడ్ కంపెనీ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసింది.

లోకల్ స్ట్రీట్ ఫుడ్ పరంగా మన దేశం నుంచి ముంబై, ఢిల్లీకి టాప్100 జాబితాలో చోటు లభించింది. ఢిల్లీకి 16వ స్థానం, ముంబైకి 34వ స్థానం దక్కాయి. తన సొంత డేటాబేస్, గూగుల్ లో రెస్టారెంట్ల రేటింగ్ లు ఆధారంగా టేస్ట్ అట్లాస్ పట్టణాలకు ర్యాంకులు కేటాయించింది. ప్రతీ పట్టణంలోనూ అక్కడి సంప్రదాయాలు, స్థానిక ప్రజల అభిరుచులకు తగ్గట్టు కొన్ని ప్రత్యేక వంటలు ఉంటాయని తెలిసిందే. లోకల్ ఫుడ్ విషయంలో ఇటలీలోని ఫ్లోరెన్స్ మొదటి స్థానంలో ఉంది. 

ఢిల్లీకి వెళితే తప్పకుండా రుచి చూడాల్సిన వాటిల్లో ఛోలే బాచుర్, బటర్ చికెన్, ఆలూ టిక్కి, నిహారి, పకోరా (మన దగ్గర పకోడీ). ఇక ముంబైకి వెళితే వడా పావ్, పావ్ బాజీ, భేల్ పూరి, బాంబే శాండ్ విచ్, రగ్డా పట్టీస్ ను తప్పకుండా రుచి చూడాలని టేస్ట్ అట్లాస్ పేర్కొంది. వినూత్నమైన రుచులు, సాంస్కృతిక ప్రాధాన్యం, పాక వైవిధ్యం ఇలా ఎన్నో భారత స్ట్రీట్ ఫుడ్ కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చినట్టు తెలిపింది.
Indian cities
famous
local food
street food
delhi
mumbai

More Telugu News