Telcom companies: ఆదాయం పెంచుకునేందుకు టెలికం కంపెనీల ఎత్తుగడలు

Telcos restricting calls number of data top ups to improve ARPU
  • ప్లాన్ గడువు ముగిసిన వెంటనే సేవలు బంద్
  • రీచార్జ్ చేసుకుంటేనే తిరిగి సేవల పునరుద్ధరణ
  • ఎక్స్ పైరీ తర్వాత డేటా టాపప్ లపై పరిమితులు
  • యూజర్ నుంచి సగటు ఆదాయం పెంచుకునే వ్యూహాలు
టెలికం కంపెనీలకు ఆదాయ దాహం తగ్గలేదు. ఒక్కో యూజర్ నుంచి వీలైనంత ఆదాయం రాబట్టుకునేందుకు అవి ఎన్నో రకాల ఆలోచనలు చేస్తున్నాయి. ఒక్కోటీ అమల్లో పెడుతున్నాయి. టారిఫ్ లను వెంట వెంటనే పెంచడానికి వెసులుబాటు ఉండదు. అలా చేస్తే వినియోగం తగ్గొచ్చు లేదా కస్టమర్లను కోల్పోవచ్చు. నియంత్రణ సంస్థ నుంచి ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చు. అందుకని టెలికం కంపెనీలు ఏడాదికోసారి టారిఫ్ లు పెంచుతూ వెళుతున్నాయి. మధ్యే మార్గంలో ఇతర చర్యలను కూడా అమలు చేస్తున్నాయి. 

రెండేళ్ల క్రితం రూ.29, రూ.35 రీచార్జ్ (ప్రీపెయిడ్)తో కూడా నెల మొత్తం ఒక సిమ్ కార్డుపై సేవలు పొందే అవకాశం ఉండేది. ఇప్పుడు, బీఎస్ఎన్ఎల్ మినహాయిస్తే మిగిలిన మూడు ప్రైవేటు టెలికం కంపెనీల్లో రూ.150లోపు నెలవారీ ప్లాన్ లేదు. అంటే నెలవారీ కనీస రీచార్జ్ ప్లాన్ ధరను తెలివిగా పెంచుతున్నాయి. ఇప్పుడు రీచార్జ్ గడువు ముగిసిన వెంటనే (అదే రోజు) అవుట్ గోయింగ్, ఇన్ కమింగ్ కాల్స్ సేవలు నిలిపివేస్తున్నాయి. దీంతో యూజర్లు మరో మార్గం లేక వెంటనే రీచార్జ్ చేసుకుంటారని వాటి వ్యూహం. అంతేకాదు వాయిస్ వ్యాలిడిటీ ముగిసిన వెంటనే, డేటా టాపప్ ల్లోనూ పరిమితులు పెడుతున్నాయి. వాయిస్ ప్లాన్ రీచార్జ్ గడువు ముగిసిన తర్వాత డేటా టాపప్ రీచార్జ్ లను మూడు సార్లకు మించి అనుమతించడం లేదు.

‘‘ఇలాంటి చర్యలతో ఆదాయం కొద్ది మేర పెరగొచ్చు కానీ, టారిఫ్ లను పెంచడం ద్వారానే వాటికి ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) గణనీయంగా పెరగడానికి వీలుంటుంది’’ అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే టారిఫ్ ల పెంపు వచ్చే సాధారణ ఎన్నికల్లోపు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

 చివరిగా 2021 నవంబర్ లో టెలికం కంపెనీలు టారిఫ్ లను పెద్ద ఎత్తున పెంచాయి. ప్రస్తుతం అంటే మార్చి చివరికి ఎయిర్ టెల్ కు ఒక్కో యూజర్ నుంచి సగటున రూ.193 వస్తోంది. జియోకి రూ.178.80 వస్తోంది. మధ్యకాలానికి రూ.300కు చేరితేనే కంపెనీలు మనుగడ సాగించగలవని ఎయిర్ టెల్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. కనుక టెలికం యూజర్లు భవిష్యత్తులో మరింత ఖర్చు చేసేందుకు సిద్ధం కాక తప్పేలా లేదు.
Telcom companies
restricting calls
data top ups
ARPU
improve

More Telugu News