ZapCom: హైదరాబాద్ లో జాప్‌కామ్ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ కేంద్రం

ZapCom Group to set up Center of Excellence in Hyderabad
  • మంత్రి కేటీఆర్ తో భేటీ తర్వాత ప్రకటించిన సంస్థ
  • తొలి ఆరు నెలల్లో 500, ఏడాదిలో వెయ్యి మందికి ఉద్యోగాలు
  • ట్రావెల్‌, హాస్పిటాలిటీ, ఫిన్‌టెక్‌ రంగాల్లో ఏఐ, ఎన్ఎల్‌పీ ఉత్ప‌త్తుల‌ను అందిస్తున్న జాప్‌కామ్
మరో అంతర్జాతీయ సంస్థ హైద‌రాబాద్‌కు రానుంది. అమెరికాకు చెందిన ప్రొడ‌క్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూష‌న్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపు హైద‌రాబాద్‌లో సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. వాషింగ్ట‌న్ డీసీలో తెలంగాణ‌ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశం తర్వాత జాప్ కామ్ ఈ మేరకు ప్రకటించింది. ఈ భేటీలో జాప్‌కామ్ వ్య‌వస్థాప‌కుడు, సీఈవో కిషోర్ ప‌ల్ల‌మ్‌రెడ్డితో మంత్రి కేటీఆర్ చ‌ర్చించారు. 

హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌నున్న సెంటర్ తో జాప్‌కామ్ కంపెనీ తొలుత 500 మందికి, ఆ త‌ర్వాత ఏడాదిలోగా మ‌రో వెయ్యి మందికి ఉద్యోగాలు రానున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ తెలిపింది. ట్రావెల్‌, హాస్పిటాలిటీ, ఫిన్‌టెక్‌, రిటేల్ రంగాల్లో కీల‌క‌మైన ఏఐ, ఎన్ఎల్‌పీ ఉత్ప‌త్తుల‌ను జాప్‌కామ్‌ కంపెనీ రూపొందించ‌నున్న‌ది. అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో జాప్‌కామ్ కంపెనీకి కేంద్రాలు ఉన్నాయి. కాలిఫోర్నియా, టెక్సాస్‌, ఫ్లోరిడాతో పాటు సెంట్ర‌ల్ అమెరికా, భారత్ లోనూ ఆ కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి.
ZapCom
Hyderabad
usa
Center of Excellence
ktr

More Telugu News