Hyderabad: కింగ్ కోఠీ వైద్యుడికి ఆసుపత్రిలో అర్ధరాత్రి దేహశుద్ధి.. చితక్కొట్టేసిన భార్య

king kothi hospital Doctor beaten up by wife relatives over his extramarrital affair
  • వైద్యుడి అక్రమసంబంధం, ఆసుపత్రిలో యువతితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వైనం
  • భార్యకు దొరికిపోయిన యువతి, ఆసుపత్రి గోడ దూకిపారిపోయిన వైద్యుడు
  • యువతి భార్యకు చిక్కిందని తెలిసి వెనక్కొచ్చిన వైద్యుడికి దేహశుద్ధి 
పరాయి మహిళలతో అక్రమసంబంధం పెట్టుకున్న కింగ్ కోఠీ ఆసుపత్రి వైద్యుడికి భార్య, ఆమె తరపు బంధువులు బుధవారం అర్ధరాత్రి దేహశుద్ధి చేశారు. దీంతో, నారాయణగూడ పోలీసులు వైద్యుడి భార్య, ఆమె బంధువులను స్టేషన్‌కు తరలించారు. కింగ్‌కోఠీ జిల్లా ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగంలో పనిచేస్తున్న వైద్యుడు కొంతకాలంగా కొందరు యువతులతో అక్రమసంబంధాలు కొనసాగిస్తున్నాడు. అతడి భార్య, పిల్లలు ఎల్బీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. 

బుధవారం రాత్రి వైద్యుడు ఆసుపత్రిలో నైట్ డ్యూటీకి హాజరయ్యాడు. తన వెంట ఓ యువతిని కూడా తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య, ఆమె కుటుంబసభ్యులు ఆర్ధరాత్రి కింగ్ కోఠీ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడే గేటు వద్ద కాపుకాశారు. అయితే, భార్య, ఆమె బంధువులు వచ్చిన విషయం తెలుసుకున్న వైద్యుడు ఆసుపత్రి గోడ దూకి పారిపోయాడు. అతడి వెంట వచ్చిన యువతి మాత్రం వారికి దొరికిపోయింది. ఇది తెలిసి వైద్యుడు మళ్లీ ఆసుపత్రికి చేరుకోవడంతో భార్య, ఆమె బంధువులు అతడికి దేహశుద్ధి చేశారు. 

ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వైద్యుడిని, దాడికి పాల్పడ్డవారిని స్టేషన్‌కు తరలించారు. అయితే, ఇది కుటుంబపరమైన తగాదా కావడంతో తమ స్వస్థలంలోనే సమస్య పరిష్కరించుకుంటామని వారు చెప్పారు. దీంతో, పోలీసులు వారిని పంపించేశారు.
Hyderabad

More Telugu News