Shubman Gill: సందేహం లేదు.. శుభ్ మన్ గిల్ మరో టెండూల్కర్: రాబిన్ ఊతప్ప

  • విరాట్ కోహ్లీ, టెండూల్కర్ మాదిరే పెద్ద స్టార్ గా అవతరిస్తాడన్న ఊతప్ప  
  • అసాధారణ క్రికెట్ నైపుణ్యాలు చూపిస్తున్నాడంటూ ప్రశంసలు
  • యశస్వి జైస్వాల్ సైతం భవిష్యత్ స్టార్ అవుతాడన్న అంచనా
Shubman Gill becoming as big as Virat Kohli or Sachin Tendulkar says Robin Uthappa

గుజరాత్ టైటాన్స్ యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ ఐపీఎల్ 2023 సీజన్ లో బ్యాటుతో అదరగొడుతున్నాడు. గత సీజన్ లోనూ గిల్ గుజరాత్ టైటాన్స్ విజయాల్లో కీలక భూమిక పోషించాడు. అదే విధంగా ఈ ఏడాది కూడా తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. దీంతో శుభ్ మన్ గిల్ భవిష్యత్తులో విరాట్ కోహ్లీ లేదా సచిన్ టెండూల్కర్ మాదిరే టీమిండియాకు కీలక ఆటగాడిగా మారతాడన్న అభిప్రాయాన్ని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప వ్యక్తం చేశాడు.


గడిచిన ఏడాది కాలంలో శుభ్ మన్ గిల్ టీమిండియా తరఫున కూడా అదరగొట్టాడు. టీ20, టెస్ట్, వన్డేల్లో సెంచరీలు సాధించాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ పై 208 పరుగులు చేసి, వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన యువ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. కోహ్లీ, టెండూల్కర్ అంత పెద్ద స్టార్ గా ఎదిగే నైపుణ్యాలు గిల్ కు ఉన్నాయని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు అసాధారణ క్రికెట్ నైపుణ్యాలు చూపిస్తున్నాడని ప్రశంసించాడు. అసాధారణమైన ఫామ్ లో ఉన్న అద్భుత ఆటగాడిగా అతనిని అభివర్ణించాడు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో తన అభిప్రాయాలను ఊతప్ప పంచుకున్నాడు.

రాజస్థాన్ యువ ఆటగాడు యశశ్వి జైస్వాల్ ప్రస్తావన కూడా వచ్చింది. భారత క్రికెట్ కు శుభ్ మన్ గిల్, జైస్వాల్ తదుపరి పెద్ద స్టార్లుగా మారతాన్న అభిప్రాయాన్ని ఊతప్ప వ్యక్తం చేశాడు. ఈ సీజన్ లో యశస్వి జైస్వాల్ రాజస్థాన్ తరఫున 575 పరుగులు చేసి 47.92 సగటుతో ఉన్నాడు. శుభ్ మన్ గిల్ ఈ సీజన్ లో గుజరాత్ తరఫున 13 మ్యాచుల్లో 576 పరుగులు సాధించాడు. ఇందులో సన్ రైజర్స్ పై సాధించిన ఒక సెంచరీ కూడా ఉంది. అలాగే నాలుగు అర్ధ సెంచరీలు కూడా నమోదు చేశాడు. 

More Telugu News