Naveen Patnaik: దటీజ్ నవీన్ పట్నాయక్.. అభివృద్ధి పనుల కోసం తండ్రి సమాధినే తొలగించిన ఒడిశా సీఎం!

Naveen Patnaik dismantled fathers memorial for developing Puri
  • పూరీలోని ‘స్వర్గద్వార్’లో బిజూ పట్నాయక్ భారీ సమాధి
  • మరింత స్థలం అందుబాటులోకి తెచ్చేందుకు తండ్రి సమాధినే తొలగించాలని ఆదేశం
  • ఒడిశా దివస్ వేడుకల్లో గుర్తు చేసుకున్న సీఎం సెక్రటరీ వీకే పాండ్యన్
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభివృద్ధి కోసం పరితపించే ఆయన ఆ విషయంలో ఎవరినీ లెక్క చేయరు. తాజాగా, ఆయనకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో పూరీలోని శ్మశానవాటికలో చేపట్టిన అభివృద్ధి పనులకు అడ్డంగా ఉందన్న ఉద్దేశంతో ఆయన తన తండ్రి సమాధినే అక్కడి నుంచి తొలగించారట. ఈ విషయాన్ని ఆయన ప్రైవేట్ సెక్రటరీ వీకే పాండ్యన్ తెలిపారు.

దుబాయ్‌లో మొన్న నిర్వహించిన ఒడిశా దివస్ వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న పాండ్యన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలకు మేలు చేసే విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సీఎం వెనుకాడరని అన్నారు. పూరీ మహాప్రస్థానం ఆధునికీకరణ పనులకు అడ్డంగా ఉన్న తండ్రి సమాధిని తొలగించాలని అధికారులను సీఎం ఆదేశించారని ఈ సందర్భంగా పాండ్యన్ గుర్తు చేసుకున్నారు.

2019లో పూరీలోని ‘స్వర్గద్వార్’లో మరింత స్థలం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా తన తండ్రి బిజు పట్నాయక్ సమాధిని కూడా తొలగించాలని నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బిజూ పట్నాయక్ మృతి తర్వాత 17 ఏప్రిల్ 1997లో స్వర్గద్వార్‌లో భారీ సమాధిని నిర్మించారు. అయితే, దీని వల్ల అక్కడున్న స్థలం తగ్గిపోయి ఇబ్బందులు తలెత్తుతుండడంతో దానిని తొలగించాలని సీఎం స్వయంగా ఆదేశించినట్టు పాండ్యన్ తెలిపారు.
Naveen Patnaik
Odisha
Biju Patnaik
Swargadwar
Puri

More Telugu News