Assam: కంటైనర్‌ను ఢీకొన్న కారు.. అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా దుర్మరణం

  • సోమవారం అర్ధరాత్రి దాటాక ఘటన
  • ప్రమాద సమయంలో సివిల్ దుస్తుల్లో రాభా
  • ఎక్కడికి వెళ్తున్నారో తెలియదన్న ఎస్పీ
  • అవినీతి ఆరోపణలపై గతేడాది జూన్‌లో సస్పెన్షన్ వేటు
Assam Lady Singham Junmoni Rabha died in road accident

అసోంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ‘లేడీ సింగం’గా పేరుగాంచిన పోలీసు అధికారి జున్‌మోనీ రాభా దుర్మరణం పాలయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. సోమవారం జరిగిందీ ఘటన. రాభా తన ప్రైవేటు వాహనంలో ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాభాను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో సివిల్ దుస్తుల్లో ఉన్న ఆమె ఎక్కడికి వెళ్తున్నారన్న విషయంలో స్పష్టత లేదని జిల్లా ఎస్పీ తెలిపారు.

ప్రస్తుతం నాగాన్ జిల్లాలోని మోరికొలాంగ్ పోలీస్ ఔట్‌పోస్టు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఎస్సై రాభా విధుల్లో చాలా కఠినంగా, నిక్కచ్చిగా ఉండేవారు. తన పనితీరుతో ‘లేడీ సింగం’గా, ‘దబాంగ్ పోలీస్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. వీటి వెన్నంటే పలు వివాదాలు కూడా ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై గతేడాది జూన్‌లో అరెస్ట్ అయిన రాభా కొంతకాలంపాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. అప్పట్లో ఓ బీజేపీ ఎమ్మెల్యేతో ఆమె జరిపిన టెలిఫోన్ సంభాషణ ఆడియో బయటకు వచ్చి వివాదాస్పదమైంది.

More Telugu News