Sabarimala: శబరిమల అయ్యప్ప కొలువైన పొన్నాంబళమేడు అటవీ ప్రాంతంలో అక్రమంగా పూజలు!

  • మరో నలుగురితో కలిసి పూజలు చేసిన తమిళనాడు వ్యక్తి నారాయణస్వామి
  • వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన అటవీ అధికారులు
  • తాను ఎక్కడికెళ్తే అక్కడ పూజలు చేస్తుంటానన్న నారాయణస్వామి
  • గతంలో హిమాలయాల్లోనూ పూజలు చేశానని వెల్లడి
Tamil Nadu resident booked for performing illegal puja in Keralas Ponnambalamedu

శబరిమల కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కొందరు అక్రమంగా పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన నారాయణస్వామి మరో నలుగురితో కలిసి అయ్యప్పస్వామి కొలువైన హై సెక్యూరిటీ ప్రాంతం పొన్నాంబళమేడు అటవీ ప్రాంతానికి చేరుకుని అక్రమంగా పూజలు నిర్వహించాడు. వారం రోజుల క్రితమే ఆయన పూజలు నిర్వహించగా విషయం వెలుగులోకి రావడంతో అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు. అయితే, అతడు ఎక్కడ ఉండేదీ తెలియకపోవడంతో పోలీసులకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం కుదరలేదు.

అయితే, నారాయణస్వామి మాత్రం తాను అటవీ అధికారుల అనుమతితోనే పొన్నాంబళమేడు చేరుకుని పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నాడు. తాను త్రిసూర్ పక్కనున్న వడక్కుమ్‌నాథన్ ఆలయంలో ఉంటానని, గతంలో శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశానని ‘మనోరమ ఆన్‌లైన్’కు తెలిపాడు. తాను భక్తుడినని, ప్రతి సంవత్సరం శబరిమల సందర్శిస్తుంటానని చెప్పాడు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడ పూజలు చేస్తుంటానని, గతంలో హిమాలయాల్లోనూ పూజలు నిర్వహించినట్టు తెలిపాడు. పొన్నాంబళమేడు హై సెక్యూరిటీ ప్రాంతమని తనకు తెలియదని, ఇప్పటి వరకు పోలీసులు కానీ, అటవీ అధికారులు కానీ ఎవరూ తనను సంప్రదించలేదని పేర్కొన్నాడు.

More Telugu News