Heat Wave: రాజమండ్రిలో రోళ్లు పగిలే ఎండ... 48 డిగ్రీల నమోదు

  • తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
  • చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
  • పశ్చిమ వాయవ్య దిశ నుంచి వేడిగాలులు
  • బయటికి రావాలంటేనే భయపడుతున్న ప్రజలు
Rajahmundry reocrds 48 degrees celsius temperature

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూరీడు చుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం సమయానికి ఉష్ణోగ్రతలు భగభగలాడిపోతున్నాయి. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయని చెబుతుంటారు. కానీ ఈసారి రోహిణి కార్తె రాకముందే భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. 

ఏపీలోని రాజమండ్రి, గుంటూరు, ఏలూరులో ఇవాళ 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలోనూ విపరీతమైన వేడిమి నెలకొంది. బెజవాడలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చిలకలూరిపేటలో కూడా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. 

తెలంగాణలో సైతం వేసవి తీవ్రత అధికంగా ఉంది. అనేక ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొత్తగూడెం, మిర్యాలగూడలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాల్వంచలో 46, ములుగు, నల్గొండలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకుంది. మండిపోతున్న ఎండల కారణంతో ప్రజలు బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. 

ఎండలకు తోడు పశ్చిమ వాయవ్య దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో ప్రజలు సతమతమవుతున్నారు.  మరో మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి.

More Telugu News