Madhya Pradesh: చిన్నారుల్లో క్రౌర్యం.. 12 ఏళ్ల స్నేహితుడి మెడకు సైకిలు చైను బిగించి.. గొంతు కోసి దారుణహత్య!

3 minors strangle 12 yr old with cycle chain in MP
  • మధ్యప్రదేశ్‌‌లోని సియోని జిల్లాలో ఘటన
  • తన సోదరితో నిందితుడు మాట్లాడడం చూసిన బాధిత బాలుడు
  • హత్యకు అదే కారణమన్న పోలీసులు
చిన్నారుల్లో క్రౌర్యం ఎంతగా పెరిగిపోతున్నదీ చెప్పేందుకు ఇదో ఉదాహరణ. ముగ్గురు బాలురు కలిసి స్నేహితుడైన 12 ఏళ్ల బాలుడి మెడకు సైకిలు చైను బిగించి దారుణంగా చంపేశారు. అక్కడితో ఆగలేదు. తలను బండరాయితో మోది, కత్తితో గొంతు కోసి అత్యంత వికృతంగా ప్రవర్తించారు. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలోని మగర్‌కత గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

 స్నేహితుడిని దారుణంగా చంపేసిన తర్వాత మృతదేహాన్ని పాలిథిన్ బ్యాగులో చుట్టేసి వారి ఇంటి సమీపంలోని గులకరాళ్ల కుప్పలో పడేశారు. రక్తపు మరకలతో ఉన్న బ్యాగును చూసిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగు చూసింది. 

16 ఏళ్ల నిందితుడు తన సోదరితో మాట్లాడడాన్ని బాధిత బాలుడు గమనించాడు. ఇది వారిమధ్య వాగ్వివాదానికి కారణమైంది. హత్యకు ఇదే కారణమని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించి జువెనైల్ హోంకు పంపింది. నిందితుల వయసు 16, 14, 11 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు సోదరులు కూడా ఉన్నట్టు చెప్పారు.  

బాలుడిని చంపేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్న నిందితులు అతనిని ఓ నిర్జన ప్రదేశానికి పిలిచారు. అక్కడ అతడిని గట్టిగా పట్టుకుని సైకిలు చైనుతో గొంతు బిగించారు. బాధతో విలవిల్లాడుతున్న బాలుడి తలను ఆ తర్వాత బండరాయితో మోదారు. అనంతరం పదునైన కత్తితో గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని పాలిథిన్ బ్యాగులో చుట్టి వారి ఇంటి సమీపంలోని రాళ్ల కుప్పలో పడేసి పరారయ్యారు.
Madhya Pradesh
Seoni
Crime News

More Telugu News