PVR: మల్టీప్లెక్సులను మూసేస్తున్న పీవీఆర్

PVR Inox going to close over 50 theaters in coming 6 months
  • వచ్చే ఆరు నెలల్లో 50 స్క్రీన్లు క్లోజ్
  • వరుస నష్టాలతో పీవీఆర్ సంస్థ నిర్ణయం
  • ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థకు రూ.333 కోట్ల నష్టం
మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్వహణలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న పీవీఆర్ సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. వరుస నష్టాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించింది. థియేటర్ల నిర్వహణ వ్యయం పెరగడం, ఆదాయం తగ్గడంతో పాటు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడడంతో కొంతకాలంగా పీవీఆర్ నష్టాలు చవిచూస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి మార్చి వరకు దాదాపు రూ.333 కోట్లు నష్టం వాటిల్లిందని పీవీఆర్ సంస్థ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో వంద కోట్లకు పైగా నష్టపోయినట్లు వివరించాయి. ఈ నేపథ్యంలోనే స్కీన్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

నష్టాలను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా వచ్చే ఆరు నెలల్లో 50 స్క్రీన్లను మూసివేయనున్నట్లు పీవీఆర్ తెలిపింది. స్క్రీన్లను మాత్రమే మూసివేస్తామని మల్టీప్లెక్స్ లలోని మాల్స్ కొనసాగిస్తామని పేర్కొంది. కాగా, ఏడాది క్రితం ఐనాక్స్ లీజర్ తో జతకట్టిన పీవీఆర్ దేశంలోనే అతిపెద్ద మల్టిప్లెక్స్ సంస్థగా అవతరించింది. భారత దేశంతో పాటు శ్రీలంకలో కూడా మొత్తం 1,689 మల్టీప్లెక్స్ స్క్రీన్లను నడుపుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 168 స్క్రీన్లను ఓపెన్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 150 స్క్రీన్లను ప్రారంభించాలని భావించింది. ఇందులో 9 స్క్రీన్లు ఇప్పటికే ప్రారంభం కాగా మరో 15 స్క్రీన్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరో 152 స్క్రీన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే, వరుస నష్టాల కారణంగా లాభాసాటిగా లేని స్క్రీన్లను మూసేయాలని పీవీఆర్ నిర్ణయించింది.
PVR
multiplex
PVR INOX
50 screens close
entertainment

More Telugu News