Dementia: ఈ రెండు ఔషధాలతో డిమెన్షియా ముప్పు!

  • వృద్ధులను వేధించే చిత్త వైకల్యం
  • ఇందులో మతిమరుపు ప్రధాన లక్షణం
  • బెంజోడయాజెపైన్, యాంటీకోలినెర్జిక్స్ ఔషధాల వాడకంతో డిమెన్షియా
  • పలు అధ్యయనాల్లో వెల్లడి
Studies says two medicines causes Dementia risk

వృద్ధాప్యంలో చాలామదిని వేధించే సమస్య చిత్త వైకల్యం లేదా డిమెన్షియా. మెదడుకు రక్తం సరఫరా తగ్గడంతో పాటు, వివిధ రకాల అనారోగ్యాల వల్ల డిమెన్షియా బారినపడుతుంటారు. మతిమరుపు, అయోమయానికి గురికావడం, తెలిసిన ప్రదేశాలను కూడా గుర్తుపట్టలేకపోవడం, కంటి చూపుకు మెదడుకు మధ్య సమన్వయ లోపం వంటివి డిమెన్షియా లక్షణాలు. ఇందులో మతిమరుపు అనేది ప్రధాన లక్షణం. 

తాజాగా పలు అధ్యయనాల్లో... రెండు రకాల ఔషధాలు కూడా డిమెన్షియా సమస్యకు కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. బెంజోడయాజెపైన్, యాంటీకోలినెర్జిక్స్ ఔషధాలకు డిమెన్షియాకు సంబంధం ఉందని ఆ అధ్యయనాల్లో తెలిపారు. ఈ మేరకు హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ వెబ్ సైట్ లో వెల్లడించారు. 

ఎక్కువకాలం పాటు ఈ మందులు వాడిన వారిలో మతిమరుపు బారినపడే అవకాశాలు అధికం అని పరిశోధకులు గుర్తించారు. ఈ రెండు ఔషధాల్లో ఒకటైన యాంటీకోలినెర్జిక్స్ పై వాషింగ్టన్ యూనివర్సిటీ, సియాటిల్ కు చెందిన గ్రూప్ హెల్త్ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇక, బెంజోడయాజెపైన్ పై ఫ్రాన్స్, కెనడా దేశాలకు చెందిన పరిశోధకులు అధ్యయనం జరిపారు.

అధ్యయనంలో భాగంగా 65 ఏళ్లకు పైబడిన 3,500 మందిపై ఏడేళ్ల పాటు పరిశోధనలు జరిపారు. వీరంతా పరిశోధన ప్రారంభం కావడానికి 10 ఏళ్ల ముందు నుంచే ఈ రెండు ఔషధాలను వాడుతున్నారు. వారిలో 800 మంది డిమెన్షియా బారినపడినట్టు అధ్యయనంలో వెల్లడైంది. 

ఈ రెండు ఔషధాలు మెదడు కార్యకలాపాలకు తోడ్పడే న్యూరో ట్రాన్స్ మిటర్లపై ప్రభావం చూపుతున్నట్టు గమనించారు. బెంజోడయాజెపైన్ మెదడులోని న్యూరాన్లను మందకొడిగా మార్చేస్తున్నట్టు గుర్తించారు. 

ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, డిమెన్షియా ప్రాణాంతకం కూడా. ప్రపంచంలో అత్యధిక మరణాలకు దారితీస్తున్న ఆరోగ్య సమస్యల్లో డిమెన్షియా ఏడోస్థానంలో ఉంది.

More Telugu News