Wife: భర్తతో మందు మాన్పించడానికి భార్య ఏం చేసిందో చూడండి!

Wife acts like drunkard to handle alcoholic husband
  • ఆగ్రాలో చోటుచేసుకున్న ఘటన
  • నిత్యం తాగి ఇంటికి వస్తున్న భర్త
  • భార్యతో గొడవలు.. తాగుబోతులా నటించి భర్తను చితకబాదడం మొదలుపెట్టిన మహిళ
  • కౌన్సిలింగ్ సెంటర్ ను ఆశ్రయించిన భర్త
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భర్త రోజూ తాగి వచ్చి గొడవ చేస్తుండడంతో అతడితో మద్యం మాన్పించేందుకు భార్య తాగుబోతు అవతారం ఎత్తింది. ఆ వ్యక్తి ప్రతిరోజు మద్యం మత్తులో ఇంటికి వచ్చేవాడు. భర్తతో తాగుడు మాన్పించాలని ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య నిత్యం ఘర్షణ జరుగుతుండేది. దాంతో ఆ మహిళ ఎవరూ చేయని పని చేసింది. 

భర్త ఇంటికి వచ్చేసరికి తాగుబోతులా నటించేది. అచ్చం తాగుబోతులు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడేది... మద్యం మత్తులో ఎలా నడుస్తారో అలాగే నడిచేది. దాంతో ఆ భర్త దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన భార్య మందుకొట్టడం ఏంటని జుట్టు పీక్కున్నాడు. 

అతడిని మరింత నివ్వెరపరిచేలా ఆ మహిళ చేయిచేసుకోవడం ప్రారంభించింది. తాగి వచ్చి తనను ఎలా కొట్టేవాడో, తాను కూడా అతడిని అలాగే చితకబాదేది. ఇలా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయే తప్ప సమస్య పరిష్కారం కాలేదు. అతడు తాగి రావడం, ఆమె తాగినట్టు నటించడం కొనసాగాయి. 

ఈ నేపథ్యంలో, భార్య కూడా తనలాగే మద్యానికి బానిస అయిందని భావించిన ఆ వ్యక్తి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ఆశ్రయించాడు. భార్య తాగిన మత్తులో వెంటపడి ఎలా కొడుతుందో చూడండి అంటూ ఓ వీడియోను అక్కడికి వారికి చూపించాడు. దాంతో ఆ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది భార్యాభర్తలిద్దరితో మాట్లాడారు. 

తాను భర్తతో మద్యం మాన్పించడానికే తాగుబోతులా నటిస్తున్నానని భార్య వెల్లడించింది. అనంతరం ఆ కౌన్సిలింగ్ సెంటర్ వారు ఆ దంపతుల మధ్య ఓ ఒప్పందం కుదిర్చారు. అతడు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే మద్యం తాగాలని, అందుకు భార్య కూడా ఒప్పుకోవాలని ప్రతిపాదించారు. అంతేకాదు, మద్యం తాగినప్పుడు భార్యతో వాగ్వాదం పెట్టుకోవద్దని అతడికి స్పష్టం చేశారు.
Wife
Husband
Drink
Alcoholic
Agra
Uttar Pradesh

More Telugu News