West Bengal: అంబులెన్స్‌కు డబ్బుల్లేక.. ఐదు నెలల కుమారుడి మృతదేహాన్ని సంచిలో వేసుకుని బస్సులో 200 కిలోమీటర్ల ప్రయాణం!

  • పశ్చిమ బెంగాల్‌లో ఘటన
  • మృతదేహాన్ని తరలించేందుకు రూ. 8 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్
  • డబ్బుల్లేక మృతదేహాన్ని సంచిలో పెట్టి ఎవరి కంటా పడకుండా 200 కిలోమీటర్ల ప్రయాణం
  • మమత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న బీజేపీ
Bengal man travels 200 km with sons body in bag

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఐదు నెలల కుమారుడిని ఇంటికి చేర్చేందుకు అంబులెన్స్ డ్రైవర్ రూ. 8 వేలు డిమాండ్ చేశాడు. అంత సొమ్ము తన వద్ద లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని సంచిలో పెట్టి ఎవరి కంటపడకుండా జాగ్రత్త పడుతూ బస్సులో 200 కిలోమీటర్లు ప్రయాణించాడో వలస కూలి.

హృదయవిదారకమైన ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముస్తాఫానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని డండిపరా గ్రామానికి చెందిన అసీం దేవశర్మ వలస కూలి. శర్మ దంపతులకు పుట్టిన కవలలు అనారోగ్యం బారినపడ్డారు. దీంతో శనివారం వారిని తొలుత కలియగంజ్ స్టేట్ జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో రాయ్‌గంజ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఆ తర్వాత నార్త్ బెంగల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 

చిన్నారుల పరిస్థితి మరింత క్షీణించడంతో అసీం దేవశర్మ భార్య ఓ చిన్నారిని తీసుకుని గురువారం ఇంటికి వెళ్లిపోయింది. మరో కుమారుడు చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో చనిపోయిన తన చిన్నారిని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సమకూర్చాల్సిందిగా నార్త్ బెంగల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని అసీం ఆశ్రయించాడు. ఫలితం లేకపోవడంతో అంబులెన్స్ డ్రైవర్‌ను సంప్రదించాడు. మృతదేహాన్ని తరలించేందుకు రూ. 8 వేలు అవుతుందని చెప్పడంతో అసీం ఒక్కసారిగా షాకయ్యాడు. 

అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని అసీం.. చిన్నారి మృతదేహాన్ని సంచిలో పెట్టి ఎవరికంటా పడకుండా జగ్రత్తలు తీసుకున్నాడు. సిలిగురిలో ప్రైవేటు బస్సెక్కి రాయ్‌గంజ్ చేరుకున్నాడు. తన స్వగ్రామమైన కలియగంజ్ చేరుకునేందుకు అక్కడ మరో బస్సెక్కాడు. కలియాగంజ్‌లోని వివేకానంద ఇంటర్‌సెక్షన్‌కు చేరుకున్న తర్వాత అక్కడ సాయం కోసం అర్థించగా ఓ వ్యక్తి అంబులెన్స్ సమకూర్చాడు. 

తన ఐదు నెలల కుమారుడు సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీలో ఆరు రోజులుగా చికిత్స పొందుతూ గత రాత్రి మరణించినట్టు అసీం చెప్పాడు. ఈ క్రమంలో తాను రూ.16 వేలు ఖర్చుపెట్టినట్టు వివరించాడు. బాబు చనిపోయాక అంబులెన్స్ కోసం ప్రయత్నిస్తే.. అంబులెన్స్‌లు రోగుల కోసమే తప్ప మృతదేహాల కోసం కాదని డ్రైవర్ చెప్పినట్టు వివరించాడు. అయితే, రూ. 8 వేలు ఇస్తే మృతదేహాన్ని తరలిస్తామని చెప్పాడని పేర్కొన్నాడు. తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో ప్రైవేటు బస్సెక్కానని, కలియాగంజ్ వరకు 200 కిలోమీటర్ల ప్రయాణించానని వివరించాడు. అక్కడ ఓ వ్యక్తిని కలిసి తన కష్టం గురించి చెబితే అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పాడు. 

అసీం దేవశర్మకు ఎదురైన అనుభవం విషయం వెలుగులోకి రావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రంలో హెల్త్ కేర్  ఇలా ఏడ్చిందంటూ బీజేపీ పశ్చిమ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ‘స్వస్థ్య సాథి’ హెల్త్ ‌ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇదేనా? అని బీజేపీ మరో నేత సువేందు అధికారి మమత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ అసీం దేవశర్మ వీడియోను షేర్ చేశారు. ‘అడ్వాన్స్ బెంగాల్’ (ఎగియె బెంగాల్) మోడల్ ఇదేనా? అని ప్రశ్నించారు. బీజేపీ విమర్శలపై స్పందించిన టీఎంసీ రాజ్యసభ సభ్యుడు శంతను సేన్.. చిన్నారి మృతిని కుళ్లు రాజకీయాలకు వాడుకోవద్దని హితవు పలికారు.

More Telugu News