Varla Ramaiah: ఆ నోటీసులతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదు: వర్ల రామయ్య

Varla Ramaiah press meet
  • కృష్ణా నది కరకట్ట నివాసానికి జప్తు నోటీసులు
  • సీఐడీ సూచనతో అటాచ్ చేసిన ప్రభుత్వం
  • అక్కడేం జరిగిందని నోటీసులు ఇచ్చారన్న వర్ల రామయ్య
  • ఇన్నర్ రోడ్డులో తట్ట మట్టి వేయకుండానే నేరం జరిగిందా అంటూ ఆగ్రహం
అమరావతిలో కృష్ణా నది ఒడ్డున కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను సీఐడీ సూచనతో ప్రభుత్వం అటాచ్ చేసింది. దీనికి సంబంధించిన జప్తు నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని విమర్శించారు. 

అక్కడ అసలేమీ జరగకుండానే నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇన్నర్ రోడ్డులో తట్ట మట్టి కూడా వేయలేదని, అలాంటప్పుడు అక్కడ జరిగిన నేరం ఏంటని నిలదీశారు. అసలు, ఆ నివాసానికి ఇచ్చిన జప్తు నోటీసులతో చంద్రబాబుకు సంబంధమే లేదని వర్ల రామయ్య స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రజలు ఈ అబద్ధపు ప్రభుత్వ మాటలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, చంద్రబాబును అవినీతిపరుడిగా చిత్రీకరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ పై 11 కేసుల్లో 420గా చార్జిషీట్లు వేశారని, దాంతో, తానే కాదు చంద్రబాబు కూడా అవినీతిపరుడే అని చూపించడం కోసమే ఇలాంటి కుటిల యత్నాలకు పాల్పడుతున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. 

"ఈ ఇంట్లో నాలుగేళ్లుగా నేను ఉంటున్నా... దీన్ని క్రమబద్ధీకరించండి... ఈ ఇంట్లో ఉండే అర్హత నాకుంది... మీ వద్ద ఫైలు పెండింగ్ లో ఉంది అని చంద్రబాబు గారు చెప్పారు. మరి అప్పుడే ఎందుకు సీఐడీతో దర్యాప్తు చేయించలేదు? ఏం తమాషాలు చేస్తున్నారా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అబద్ధాలు చెప్పి అందలం ఎక్కాలనుకుంటున్నారా?" అంటూ వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పటికీ తప్పు చేయరని స్పష్టం చేశారు.
Varla Ramaiah
Chandrababu
Notice
CID
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News