Revanth Reddy: అలా కుమారస్వామిని సీఎం చేయాలని కేసీఆర్ చూశారు కానీ..: రేవంత్ రెడ్డి ఆగ్రహం

Revanth Reddy lashes out at KCR and PM modi
  • కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని వ్యాఖ్య
  • హంగ్ వస్తే బీజేపీ మద్దతుతో కుమారస్వామిని సీఎంగా చేయాలని కేసీఆర్ చూశారన్న రేవంత్
  • హైదరాబాద్ కర్ణాటకలో ఎక్కువచోట్ల కాంగ్రెస్ గెలిచిందని చెప్పిన రేవంత్
  • అక్కడి ప్రజల ఆలోచన తెలంగాణ ప్రజలు పోలి ఉంటారన్న పీసీసీ చీఫ్
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం అన్నారు. కుట్రలతో కన్నడనాట జేడీఎస్ ను గెలిపించి, హంగ్ అసెంబ్లీ ద్వారా బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని, దాంతో తన రాజకీయ పబ్బం గడుపుకుందామని కేసీఆర్ భావించారని ఆరోపించారు. కానీ కర్ణాటక ప్రజలు ఆయన కుతంత్రాన్ని తిప్పికొట్టారన్నారు.

కర్ణాటకలో బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయాలని కేసీఆర్ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కుమారస్వామి సీఎం కావాలంటే కర్ణాటకలో హంగ్ రావాలని, అప్పుడే జేడీఎస్ కీలకమవుతుందని చెప్పారు. కానీ ప్రజలు మాత్రం ఆ పార్టీలకు బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ గెలువకూడదని కోరుకున్న ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఆలోచనలను ప్రజలు తిప్పికొట్టారన్నారు.

హైదరాబాద్ కర్ణాటకలోని ఎక్కువ చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. అక్కడి ప్రజల జీవన విధానంతో పాటు ఆలోచన సరళిలోను తెలంగాణ ప్రజలతో పోలి ఉంటారని, కాబట్టి కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతమవుతాయన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదటి గెలుపు హిమాచల్ ప్రదేశ్, రెండో గెలుపు కర్ణాటకలో కనిపించిందని, తెలంగాణలో మూడో విజయం సాధించబోతున్నామన్నారు.

2024 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, ఢిల్లీలో గద్దెనెక్కుతుందని జోస్యం చెప్పారు. అహంకారం, అవినీతి సొమ్ముతో గెలవాలని ప్రధాని మోదీ, బీజేపీ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదన్నారు. తెలంగాణలోను కేసీఆర్ అహంకారం, అవినీతిని ప్రజలు తిప్పికొడతారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
Revanth Reddy
Congress
Karnataka

More Telugu News