NV Ramana: తిరుమల ఘాట్ రోడ్డులో చెత్తను ఏరివేసిన మాజీ సీజేఐ ఎన్వీ రమణ

  • సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో పాల్గొన్న ఎన్వీ రమణ
  • భక్తులు పారవేసిన చెత్తను స్వయంగా సేకరించిన మాజీ సీజేఐ
  • తిరుమల స్వచ్ఛతను కాపాడడం భక్తుల బాధ్యత అని వెల్లడి
  • ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం దైవ కృపగా భావిస్తున్నానని వ్యాఖ్యలు
Former CJI NV Ramana cleans garbage at Tirumala ghat road

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ టీటీడీ చేపట్టిన సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లకార్డు చేతబూని తిరుమల పరిశుభ్రతపై ప్రచారం చేశారు. ఇందులో భాగంగా, అలిపిరి వద్ద తిరుమల ఘాట్ రోడ్డులో చెత్తను ఏరివేశారు. భక్తులు పారవేసిన చెత్తను స్వయంగా సేకరించారు. 

ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ, తిరుమల పరిశుభ్రతను, పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్క భక్తుడి కర్తవ్యం అని పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఇక్కడి పరిశుభ్రతను పరిరక్షించడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు. నిర్దేశించిన ప్రదేశాల్లోనే ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను పారవేయాలని తెలిపారు. 

సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో పాల్గొనడం దైవ కృపగా భావిస్తున్నానని తెలిపారు. తిరుమల స్వచ్ఛతను కాపాడేందుకు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేవతలు నడయాడే ఈ సప్తగిరులు అత్యంత పవిత్రమైనవని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. 

తిరుమల దివ్యక్షేత్రంలో జరిగే కార్యక్రమాల్లో న్యాయమూర్తులకు కూడా స్వచ్ఛంద సేవలు అందించే అవకాశం కల్పించాలని 2008లో అప్పటి టీటీడీ జేఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తాను కోరిన విషయాన్ని ఎన్వీ రమణ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

More Telugu News