West Bengal: బెంగాల్ లో 36 వేల మంది టీచర్ల నియామకం రద్దు

Appointment Of All 36000 Candidates Cancelled in Bengal By Calcutta High Court
  • కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు
  • రిక్రూట్ మెంట్ లో అవినీతి జరిగిందని తేల్చిన న్యాయస్థానం
  • మళ్లీ నియామక ప్రక్రియను చేపట్టాలంటూ విద్యాశాఖ బోర్డుకు ఆదేశాలు
  • రాష్ట్రంలో ఈ స్థాయి అవినీతి ఎన్నడూ చూడలేదన్న జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్
బెంగాల్ లో ప్రాథమిక విద్యాశాఖలో పనిచేస్తున్న 36 వేల మంది టీచర్లను కలకత్తా హైకోర్టు తొలగించింది. వారి నియామక ప్రక్రియలో భారీ అవినీతి చోటుచేసుకుందని, అర్హతలు లేకున్నా ఎంపిక చేసినట్లు తేలిందని పేర్కొంది. రాష్ట్రంలో ఈ స్థాయి అవినీతి ఎన్నడూ చూడలేదని ఈ కేసు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ వ్యాఖ్యానించారు. తొలగించిన టీచర్ల స్థానంలో అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రాథమిక విద్యాశాఖ బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికే అవకాశం ఇవ్వాలని, నియామక ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.

2016లో బెంగాల్ లో ప్రైమరీ టీచర్ల నియామకం జరిగింది. మొత్తంగా 36 (కాస్త అటూఇటూగా) వేల మంది ఎంపికయ్యారు. అందరూ విధుల్లో చేరారు. అయితే, ఈ నియామక ప్రక్రియలో అవినీతి జరిగిందంటూ కొంతమంది అభ్యర్థులు కోర్టుకెక్కారు. సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం.. రిక్రూట్ మెంట్ ప్రాసెస్ లో అవినీతి జరిగింది నిజమేనని తేల్చింది. అభ్యర్థుల ఎంపిక చెల్లదని ప్రకటించింది. అందరినీ విధుల్లోంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన వారి స్థానంలో 2016లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను నియమించాలని విద్యాశాఖకు హైకోర్టు సూచించింది. ఇందుకోసం మరోమారు నియామక ప్రక్రియను చేపట్టి మూడు నెలల్లోగా పూర్తిచేయాలని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ ఆదేశించారు.
West Bengal
culcutta high court
justice gangopadhyay

More Telugu News