zeroda: ఉద్యోగుల్ని తొలగిస్తూ ఏఐపై నిందలు వేస్తున్నాయి: జెరోదా సీఈవో
- ఏఐ కారణంగా తమ సంస్థలో ఉద్యోగుల్ని తొలగించమని జెరోదా సీఈవో వ్యాఖ్య
- ఏఐ వినియోగానికి సంబంధించి కొత్త విధివిధానాలను రూపొందించినట్లు ట్వీట్
- ఏఐ సాంకేతికత కారణంగా చోటు చేసుకున్న మార్పులను అంగీకరిస్తున్నామని వెల్లడి
కొంతకాలంగా ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మిలియన్ మంది ఉద్యోగాలు కోల్పోతారనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జెరోదా సీఈవో నితిన్ కామత్ ఏఐ, ఉద్యోగుల తొలగింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ కార్యకలాపాల్లో కూడా ఏఐ టెక్నాలజీని వినియోగిస్తామని తెలిపారు. అయితే ఏఐఏ కారణంగా తమ సంస్థలో ఉద్యోగులను తొలగించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సంస్థలో ఏఐ వినియోగానికి సంబంధించి కొత్త విధివిధానాలను రూపొందించినట్లు ట్వీట్ చేశారు.
జెరోదాలో ఏఐ పాలసీని పరిచయం చేస్తున్నామని, ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, కొత్త టెక్నాలజీ కారణంగా ఉద్యోగులను తొలగించమని చెప్పారు. 2021లో అందరూ ఏఐ గురించి చర్చిస్తున్న సమయంలో దాంతో ఎలాంటి ఉపయోగం లేదని భావించామన్నారు. కానీ ఇటీవలి కాలంలో ఏఐ సాంకేతికత కారణంగా చోటు చేసుకున్న మార్పులను అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ, ఏఐపై నింద వేస్తున్నాయన్నారు.